అవార్డులపై మళ్లీ కౌంటరేసిన మురుగదాస్

అవార్డులపై మళ్లీ కౌంటరేసిన మురుగదాస్

జాతీయ అవార్డుల రగడ ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదు. విమర్శలు ప్రతి విమర్శలతో ఈ వేడి రాజుకుంటూనే ఉంది. అవార్డుల ప్రకటన తర్వాత అసంతృప్తుల్లో ఎవరో ఒకరు గళమెత్తడం.. అవార్డుల్లో పక్షపాతం ప్రదర్శించారని ఆరోపించడం మామూలే. మామూలుగా జ్యూరీ సభ్యులు ఈ విమర్శల్ని పెద్దగా పట్టించుకోరు.

కానీ ఈసారి జరుగుతున్నది భిన్నం. అవార్డు ఆశించి భంగపడ్డ వాళ్లు కాకుండా.. జాతీయ అవార్డుల రేసులో లేని సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్.. జ్యూరీకి హెడ్‌గా ఉన్న మరో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించడం.. జ్యూరీ పక్షపాతంతో వ్యవహరించిందని అనడం చర్చనీయాంశమైంది.

ఐతే తనను విమర్శించిన వాళ్లందరికీ కౌంటర్లు ఇస్తూ వస్తున్న ప్రియదర్శన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మురుగదాస్‌పై తీవ్ర ఆరోపణలే చేశాడు. అక్షయ్ కుమార్‌తో సినిమా చేయడానికి ప్రయత్నించి భంగపడ్డందుకే అతడికి అవార్డు రావడాన్ని జీర్ణించుకోలేక మురుగదాస్ విమర్శలు గుప్పిస్తున్నాడని అన్నాడు ప్రియదర్శన్.

దీనిపై మురుగదాస్ మౌనంగా ఏమీ లేడు. మళ్లీ జాతీయ అవార్డుల జ్యూరీనుద్దేశించి విమర్శలు గుప్పించాడు. ‘‘ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాదించడం మాని నిజాలు నిగ్గు తేలిస్తే మంచిది’’ అంటూ ప్రియదర్శన్‌కు కౌంటర్ ఇచ్చాడు మురుగదాస్. మరి దీనిపై ప్రియదర్శన్ మళ్లీ స్పందిస్తాడా.. సైలెంటుగా ఉండి ఇంతటితో వివాదానికి తెరదించుతాడా చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు