అరవ పైత్యం మనోళ్లకు బాగానే అబ్బేసింది

అరవ పైత్యం మనోళ్లకు బాగానే అబ్బేసింది

అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో తమిళ స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను చూస్తే అర్థమవుతుంది. తమ హీరోల సినిమాలకు సంబంధించి ఏ విశేషం బయటికి వచ్చినా వాళ్లు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఫస్ట్ లుక్కో.. టీజరో విడుదలవుతుంటే కంప్యూటర్ ముందు కూర్చుని హారతులు పట్టడం.. పోస్టర్ ప్రింట్ తీసి పాలాభిషేకాలు చేయడం.. దండలేసి హంగామా చేయడం.. ఇలాంటి పైత్యాలకు అరవ అభిమానులు పెట్టింది పేరు. ముఖ్యంగా విజయ్.. అజిత్ అభిమానులు ఇలాంటి హంగామా ఎక్కువ చేస్తుంటారు. వీళ్లే సోషల్ మీడియాలో పరస్పరం యుద్ధాలకు దిగుతుంటారు. అవతలి హీరోను.. అతడి అభిమానుల్ని కించపరుస్తూ ట్రోలింగ్ ఓ రేంజిలో చేస్తుంటారు.

ఇప్పుడు మన తెలుగు హీరోల అభిమానులు కూడా అరవ ఫ్యాన్స్‌కు ఏమీ తీసిపోమని చాటుతున్నారు. ఈ మధ్య స్టార్ హీరోల అభిమానులందరూ ఇదే తరహాలో అతి చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ రిలీజైతే.. మహేష్ అభిమానుల హడావుడి మామూలుగా లేదు. ఫస్ట్ లుక్ రిలీజైన కాసేపటికే పోస్టర్లు బయటికవ వచ్చేశాయి. వాటికి పూజలు చేయడం.. హారతులు పట్టడం.. పాలాభిషేకాలు చేయడం.. ఇంకా చాలా హంగామానే నడిచింది.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి తమ అభిమానాన్ని చాటిచెప్పారు. అంతేనా.. ఫస్ట్ లుక్ రిలీజైన గంటలో కార్ల మీద, బైకుల మీద అప్పుడే ‘స్పైడర్’ ఫొటోలు.. టైటిల్ లోగోలు ముద్రించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసి సంబరపడిపోయారు. మొన్న ‘జై లవకుశ’ టైటిల్ లోగో రిలీజైనపుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇలాగే చేశారు. దానికి ముందు ‘కాటమరాయుడు’కు సంబంధించి పవన్ అభిమానులదీ ఇదే తీరు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ గురించి చెప్పేదేముంది? ట్విట్టర్, ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే చాలు.. కంపు కంపే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు