వైట్ల అంత కొత్తగా ఏం చేసేశాడో..

వైట్ల అంత కొత్తగా ఏం చేసేశాడో..

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేయబోతోంది ‘మిస్టర్’ సినిమా. ఈ సినమా శ్రీను వైట్లకు ఎంత కీలకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అంతకుముందు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన వాడు.. ఆగడు, బ్రూస్ లీ లాంటి డిజాస్టర్లతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాడు. ఫ్లాపులు ఎవరికైనా మామూలే కానీ.. మరీ ఒకే ఫార్ములాను పట్టుకుని వేలాడుతున్నాడంటూ వైట్లకు చాలా చెడ్డ పేరు వచ్చింది.

‘ఆగడు’ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా అతడి మార్పు రాకపోవడం.. ‘బ్రూస్ లీ’లో కూడా మళ్లీ పాత సినిమానే చూపించడం ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ‘మిస్టర్’ తన పాత సినిమాల తరహాలో ఉండదని నొక్కి నొక్కి చెబుతున్నాడు వైట్ల. హీరో వరుణ్ తేజ్ కూడా ఇది వైట్ల గత సినిమాలకు భిన్నంగా ఉండదని అంటున్నాడు.

కాకపోతే గోపీమోహన్ లాంటి రెగ్యులర్ రైటర్ అందించిన కథ.. పైగా శ్రీధర్ సీపాన లాంటి కమర్షియల్ రైటర్ దీనికి మాటల సహకారం అందించిన నేపథ్యంలో మరీ అంత కొత్తదనం ఏముంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ కొంచెం కొత్తగా అనిపించినా.. ట్రైలర్ మాత్రం కొంచెం రొటీన్ గానే అనిపించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాకపోతే కొత్తదనం కొత్తదనం అంటూనే.. ప్రేక్షకులు మరీ ఏదో ఆశించి సినిమాకు వస్తారేమో అన్న సందేహంతో తన మార్కు కామెడీ ఉంటుందని కూడా చెబుతున్నాడు వైట్ల. మరి వైట్ల సినిమాల్లో కామెడీ రొటీన్ అయిపోయిందన్నదే కదా అసలు కంప్లైంట్. మరి తన మార్కు కామెడీ అంటూ వైట్ల ఏం కొత్తదనం చూపిస్తాడన్నదీ సందేహమే. మొత్తంగా ‘మిస్టర్’ ఎలా ఉండబోతోందన్నది ఒక క్లారిటీ అయితే లేదు. మరి ఈ చిత్రంలో ఏం ప్రత్యేకత ఉంటుందో.. అది ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పిస్తుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు