మెగా ప్రిన్స్.. వద్దంటున్నాడు

మెగా ప్రిన్స్.. వద్దంటున్నాడు

హీరోలకు కొంచెం ఇమేజ్ వచ్చిందంటే చాలు.. వారి పేర్ల వెనుక ఒక తోక తగిలించేస్తారు అభిమానులు. అభిమానుల అత్యుత్సాహం అది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ కూడా చాలా త్వరగానే ఓ బిరుదు సంపాదించేశాడు. అతడికి ‘మెగా ప్రిన్స్’ అనే ట్యాగ్ తగిలించేశారు అభిమానులు. ఐతే దీని మీద తనకు అంత ఆసక్తి లేదంటున్నాడు వరుణ్. ఇలాంటివి వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని అతను చెప్పాడు.

‘‘ఈ పిలుపు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తరం హీరోలెవ్వరూ ఇలాంటి బిరుదులకు అంత ప్రాధాన్యం ఇవ్వరు. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్‌ను బాద్ షా అని.. అమీర్ ఖాన్‌ను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు. కానీ వాళ్లిద్దరూ ఆ బిరుదుల్ని వాడుకోవాలని అనుకోరు. తమ పేర్ల ముందు వాటిని వేసుకోరు. అలాంటపుడు మనం మాత్రం ఎందుకు తాపత్రయపడాలి. నా వరకు అలాంటి వాటిపై ఆసక్తి లేదు’’ అని వరుణ్ స్పష్టం చేశాడు.

ఇక అభిమానుల కోసమే సినిమాలు తీయడంపైనా వ్యతిరేకత చూపించాడు వరుణ్. ‘‘కేవలం ఫ్యాన్స్ చూస్తేనే సినిమాలు ఆడేయవు. అభిమానులు కచ్చితంగా మాకు కొండంత అండే. కానీ సినిమాను అందరూ చూస్తేనే ఆడుతుంది. నిజానికి అభిమానులు ఏ ఒక్క హీరోకో పరిమితం కారు. వాళ్లు కూడా వేరే హీరోల సినిమాలు చూస్తారు. అందుకే మన సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తున్నాయి. అభిమానులు మాత్రమే చూస్తే ఇన్ని వసూళ్లు రావు. ఏ ఒక్క వర్గానికో నా సినిమాలు పరిమితం కావాలని నేననుకోవడం లేదు. అందరికీ నచ్చే సినిమాలు చేయాలి’’ అని వరుణ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు