ఆ విమర్శలపై రాజమౌళి భార్య సమాధానమిది

ఆ విమర్శలపై రాజమౌళి భార్య సమాధానమిది

కథ విజయేంద్ర ప్రసాద్ రాస్తాడు. సంగీతం కీరవాణి ఇస్తాడు. నేపథ్య సంగీత సహకారం కళ్యాణ రమణ అందిస్తాడు. రచనలో ఏదైనా సహకారం అవసరమైన ఎస్.ఎస్.కాంచి అందుబాటులో ఉంటాడు. రమ రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది. నిర్మాణ వ్యవహారాల్ని వల్లి చూసుకుంటుంది. ఇక సినిమా తీసేదేమో రాజమౌళి. మొత్తంగా రాజమౌళి సినిమా అంటే అదో ఫ్యామిలీ ప్యాకేజీ.

ఇప్పటిదాకా రాజమౌళి టీం నుంచి ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ రాలేదు. ప్రతి సినిమా కూడా గత సినిమాను మించే ఉంటోంది. ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ పనితీరు విషయంలో ఎలాంటి అభ్యంతరాల్లేవు. కానీ ఇండస్ట్రీ జనాల్లో మాత్రం వీరిపై కొంత అసూయ ఉంది. ఈ అసూయతోనే బయటి వాళ్లకు అవకాశాలివ్వరంటూ విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి సతీమణి రమ ఈ విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చింది. ఆమె ఏమందంటే..

‘‘మాకు కలిసి పని చేసే సత్తా ఉంది. ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. మేం చేసినంత పని ఇపుడున్న ఇండస్ట్రీలో ఎవరూ చేయలేరు. మేము 20 గంటలు అలాగే ఫీల్డ్ మీద నిలబడి పని చేయగలం. నాలుగున్నరేళ్లుగా ‘బాహుబలి’ కోసం ప్రతి రోజూ 20 గంటలు పని చేసాం. అలా ఎవరు చేయగలరు? మేం ఎరినీ క్వశ్చన్ చేయకుండా.. రూల్స్ మాట్లాడకుండా ఇది మన పని, మన ప్రాజెక్ట్ అనుకుని... దీన్ని సరిగ్గా పూర్తి చేయాలి అనే ఆలోచనతో అందరం కలిసి కట్టుగా కష్టపడతాం. మాకు కలిసి పని చేయడం సౌకర్యంగా ఉంటుందిది. హార్డ్ వర్క్ అనేది మా జీన్స్‌లోనే ఉంది. ఈ పనులన్నీ మేమే సమర్థంగా చేసుకోగలిగినపుడు బయటివాళ్లు ఎందుకు? పనికి రాని వాళ్లను తీసుకొచ్చి మేం ప్రమోట్ చేస్తుంటే మమ్మల్ని తప్పు బట్టాలి, మా వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే.. లేదా ఏదైనా నష్టం వచ్చి ఉంటే అనాలి. అలా లేనపుడు విమర్శలెందుకు.  మా వరకు అలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు’’ అని రమ రాజమౌళి కుండబద్దలు కొట్టేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు