తప్పకుండా నిర్మాతనవుతాను

తప్పకుండా నిర్మాతనవుతాను

తెలుగు స్టార్ డైరెక్టర్లు ఒక్కొక్కరుగా నిర్మాణం వైపు అడుగులేస్తున్నారు ఈ మధ్య. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీళ్లందరూ ఇప్పటికే నిర్మాత అవతారం ఎత్తారు. ఈ జాబితాలోకి త్వరలోనే శ్రీను వైట్ల కూడా రాబోతున్నాడు. తాను కూడా నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు వైట్ల. ''తప్పకుండా నిర్మాతనవుతాను. నేనొక్కడినే ప్రొడక్షన్ హౌజ్ పెట్టి సొంతంగా సినిమాలు చేయొచ్చు. లేదా వేరొకరితో కలిసి అయినా చేయొచ్చు. ఏదైనా సరే నిర్మాతగా మారడం గ్యారెంటీ. నా సినిమాలే కాదు.. బయటి సినిమాలు కూడా చేయాలనుకుంటున్నా'' అని వైట్ల తెలిపాడు.

ఆగడు, బ్రూస్ లీ లాంటి ఫ్లాపులతో తనలో మార్పు వచ్చిందని.. తాను కొంచెం ముందుగానే ఇలాంటి ఫార్ములా సినిమాలు ఆపేయాల్సిందని వైట్ల అభిప్రాయపడ్డాడు. ''మొదట్లో 'ఆనందం' లాంటి ప్రేమకథ చేశాను. ఆ తర్వాత 'ఢీ'తో నా కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. అక్కడి నుంచి వరుసగా కామెడీ ఎంటర్టైనర్లు చేశాను. ఐతే ఇండస్ట్రీలోని మిగతా దర్శకులు కూడా ఈ తరహాలోనే సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

దీంతో జనాల్లో మొనాటనీ వచ్చేసింది. ఏదైనా అన్ని సార్లు చేస్తే జనాలకు బోర్ కొట్టేస్తుంది. అందుకే అలాంటి సినిమాలు ముందే ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఒకట్రెండు దెబ్బలు తగిలాకే ఆపగలిగాను. 'మిస్టర్' నా నుంచి రాబోయే భిన్నమైన సినిమా. దీనికి అన్నీ కొత్తగా ఉండేలా చూసుకున్నాను. అలాగని నా నుండి ప్రేక్షకులు ఆశించే కామెడీని మాత్రం వదల్లేదు'' అని వైట్ల చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు