ఉయ్యాలవాడకీ శాతకర్ణి తలనొప్పులే!

ఉయ్యాలవాడకీ శాతకర్ణి తలనొప్పులే!

'గౌతమిపుత్ర శాతకర్ణి' అనే సినిమా తీయాలనేది గొప్ప ఐడియా అయినప్పటికీ సినిమా తీయడానికి తగ్గ మెటీరియల్‌ లేక ఆ చిత్రంలో ఏదేదో చేసారనేది కాదనలేని నిజం. చివరకు బాలకృష్ణ కూడా 'కథ లేక ఏదేదో చేసాం' అంటూ మీడియా ముందే ఒప్పేసుకున్నారు. చారిత్రిక సినిమాలు తీయాలంటే అందుకు కావాల్సిన స్టఫ్‌ దగ్గరుండాలి. బాగా రీసెర్చ్‌ చేసి తెలియని విషయాలు శోధించడంతో పాటు వాటిని కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దడానికి తగ్గట్టు షేపప్‌ చేయాలి. చిరంజీవితో స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథతో సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథపై సురేందర్‌తో పాటు పరుచూరి బ్రదర్స్‌ కసరత్తు చేస్తున్నారు. అయితే రెండున్నర గంటల సినిమాగా తీసే స్టఫ్‌ మాత్రం వారికి దొరకడం లేదట.

కేవలం ఆయన ఏం చేసారనేది చూపించేస్తే కుదరదు కనుక, సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు జోడించాలి కనుక దానికోసం తల పట్టుకున్నారట. కనీసం రెండు గంటల పాటు నడిపించే మెటీరియల్‌ రెడీ అయితే మిగతాది పాటలు, పోరాటాల రూపంలో గడిపేసే వీలుంటుంది. అలాగే చిరంజీవిపై హీరోయిజం బాగా చూపించాల్సి వుంటుంది కనుక అందుకు తగ్గట్టుగా సన్నివేశాలు తీర్చిదిద్దాల్సి వుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా కథ ఒక కొలిక్కి రావడానికే మరికొన్ని నెలలు పట్టేలాగుందని అంటున్నారు. ఏప్రిల్‌లో షూటింగ్‌ మొదలు పెడదామని అనుకున్న చిరంజీవి ఇంకా కథ ఒక దారికి రాకపోవడం పట్ల అసహనానికి గురవుతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు