జగన్ తప్పు చేస్తున్నాడా ?

చుట్టుపక్కల ప్రపంచంలో ఏమి జరుగుతోందో చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగినట్లు లేదు. ఒకవైపు రోజుకు 7వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే అనేక రాష్ట్రాలు స్కూళ్ళని మూసేశారు. 10వ తరగతి పరీక్షలను రద్దు చేయటంతో పాటు ఇంటర్మీడియా మొదటిసంవత్సరం పరీక్షలను నిరవధికంగా వాయిదావేశారు.

చివరకు సీబీఎస్ఇ కూడా 10వ తరగతి పరీక్షను రద్దుచేసింది. ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలను రద్దుచేశాయి. ఇన్ని రాష్ట్రాలను చూసిన తర్వాత కూడా జగన్ మాత్రం తన మొండిగా ముందుకే వెళుతున్నారు. షెడ్యూల్ ప్రకారమే 10, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకే నిర్ణయించారు.

టెన్త్, ఇంటర్ పరీక్షలను యధాతథంగా జరగాలని నిర్ణయించుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పైగా విద్యార్ధులు నష్టపోకుండా ఉండేదుకే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. విద్యార్ధుల ప్రాణాలు ముఖ్యమా ? లేకపోతే పరీక్షలు ముఖ్యమా ? అన్నదే ప్రభుత్వానికి అర్ధమైనట్లు లేదు. మొండిగా స్కూళ్ళని నిర్వహించటం వల్ల ఇప్పటికే అనేకమంది విద్యార్ధులకు కరోనా వైరస్ సోకింది. 1-9 తరగతుల మధ్య విద్యార్ధులకు శెలవులు ప్రకటించిన ప్రభుత్వం 10వ తరతగి విషయంలో మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది.

స్కూళ్ళల్లో కరోనా వైరస్ బయటపడుతుండటంతో తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి తల్లి,దండ్రులు భయపడుతున్నారు. చాలా స్కూళ్ళలో విద్యార్ధుల హాజరు బాగా పడిపోయింది. జరుగుతున్న విషయాలను గమనించిన తర్వాత కూడా షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. మొత్తానికి పరీక్షల నిర్వహణ నిర్ణయం ఉన్నతాధికారులదా ? లేకపోతే జగన్ దా అన్నదే తెలియటంలేదు. ఏదేమైనా నిందలు భరించాల్సింది మాత్రం తానే అన్న విషయాన్ని జగన్ గ్రహించాలి.