చిరంజీవి కోసం బెనర్జీ స్టోరీ

చిరంజీవి కోసం బెనర్జీ స్టోరీ

కొందరిని చూస్తే మంచి నటులనిపిస్తుంది. వాళ్లకు చాలా సీనియారిటీ కూడా ఉంటుంది. కానీ వాళ్ల ప్రతిభను ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోదు. పెద్దగా గుర్తింపునకు నోచుకోని పాత్రలకే వాళ్లను పరిమితం చేస్తూ ఉంటుంది. అలాంటి నటుల్లో బెనర్జీ ఒకడు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు బెనర్జీ. వందల సినిమాల్లో నటించిన అనుభవం ఆయనది. బెనర్జీని చూడగానే మంచి నటుడు అన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆయనకు ఎప్పుడు చిన్న పాత్రలే ఇస్తుంటారు. ఇక ఏదైనా సినీ వేడుకలు జరిగినపుడు కూడా ఆయన్ని వేదిక మీదికి పిలవడం.. ప్రసంగించే అవకాశం కల్పించడం అరుదు. దీంతో ఆయన ఎలా మాట్లాడతారన్న సంగతి కూడా జనాలకు తెలిసే అవకాశం లేకుండాపోయింది.

ఐతే ‘మిస్టర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బెనర్జీకి మంచి ప్రయారిటీ ఇచ్చారు. ఆయన్ని స్టేజ్ మీదికి పిలిచి మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కటి ప్రసంగం చేశాడు బెనర్జీ. ‘‘ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి ముందు నాకు మాట్లాడే అదృష్టం తొలిసారి దక్కింది. ఆయన ముందుండగా మాట్లాడాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. సరిగ్గా చెప్పాలంటే పాతికేళ్ల నుంచి ఈ అవకాశం కోసమే చూస్తున్నా. కానీ నాకెవ్వరూ ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఒక విషయం చెబుతున్నా. తెలుగు పరిశ్రమలోనే కాదు.. మొత్తం ఇండియాలో అసలేమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇంత పెద్ద స్టార్ అయిన నటుడు ఒక్క చిరంజీవి మాత్రమే. ఆయన ఎదుగుదల అసాధారణం.

ఆయన ఎంత కష్టపడింది.. ఎంత బాధపడింది.. అన్నీ నేను దగ్గరుండి చూశాను. అందుకే ఆయన జీవితమే ఒక స్ఫూర్తి. ప్రస్తుత రచయితలందరికీ నేనొక మంచి స్క్రిప్టుకు సంబంధించిన ఐడియా చెబుతా. చిరంజీవి జీవితం మీద సినిమా తీయండి. ఆయన జీవితంలో అనేక ఆసక్తికర మలుపులున్నాయి. ఆయన దగ్గరికెళ్లి కూర్చుంటే ఎన్నో విషయాలు చెబుతారు. అవన్నీ పేపర్ మీద పెడితే అది గొప్ప స్క్రిప్టు అవుతుంది. సినిమా తీస్తే అద్భుతంగా వస్తుంది’’ అని బెనర్జీ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు