బాహుబలి దెబ్బకు హైదరాబాదే ఇల్లయింది

బాహుబలి దెబ్బకు హైదరాబాదే ఇల్లయింది

తాను ‘బాహుబలి’ కథ చెబుతూ ఉంటే ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ మధ్యలో నిద్రపోయి తన ఇగోను హర్ట్ చేశాడంటూ రాజమౌళి చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలా ఇగో హర్ట్ చేసిన వాడే.. ఆ తర్వాత తన అద్భుత పనితనంతో రాజమౌళిని మెస్మరైజ్ చేశాడు. ఏకంగా ఐదేళ్ల పాటు మరో సినిమా పని పెట్టుకోకుండా ‘బాహుబలి’కే అంకితమైపోయాడు. పగలూ రాత్రి తేడా లేకుండా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు.

పలు భాషల్లో భారీ సినిమాలు చేసే సాబు సిరిల్.. ఇప్పటిదాకా ఏ సినిమాకూ లేని విధంగా ఐదేళ్ల పాటు ‘బాహుబలి’కే అంకితం అయిపోయాడు. అంతే కాదు.. ఆయన హైదరాబాద్‌లో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడట. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ హైదరాబాదే ఇక తన ఇల్లు అంటున్నాడు సాబు.

‘‘నేను నా కెరీర్లో ఒక సినిమా కోసం ఇన్నేళ్లు పని చేస్తానని అస్సలు అనుకోలేదు. ఐదేళ్లుగా బాహుబలి సినిమానే నా ప్రపంచం అయింది. అందుకే ఇక్కడే ఇల్లు తీసుకున్నా. ‘బాహుబలి’ అయిపోయినా నేను హైదరాబాద్ నుంచి వెళ్లట్లేదు. ఈ సిటీతో నాకు ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ముఖ్యంగా బాహుబలి టీం సభ్యులు నాకు బాగా దగ్గరైపోయారు. వాళ్లతో నేను ఇదే బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నా. అందుకే హైదరాబాద్‌లోనే ఉంటున్నా. ‘బాహుబలి’ తర్వాత అదే స్థాయిలో భారీ సినిమా అయిన ‘సంఘమిత్ర’కు పని చేస్తున్నా. అది కూడా పీరియడ్ ఫిలిం. చాలా కష్టపడాల్సి ఉంది. ఆ సినిమా పని చెన్నైలో జరుగుతున్నప్పటికీ నా నివాసం మాత్రం హైదరాబాద్‌లోనే కొనసాగుతుంది’’ అని సాబు సిరిల్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు