పవన్‌కళ్యాణ్‌ పరువు తీసేలాగున్నారు!

పవన్‌కళ్యాణ్‌ పరువు తీసేలాగున్నారు!

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో నష్టపోయిన బయ్యర్ల కోసం తీస్తున్నామంటూ చెప్పుకున్న 'కాటమరాయుడు' చిత్రాన్ని తక్కువ రేట్లకి కాకుండా మార్కెట్‌ రేట్లకే విక్రయించిన సంగతి తెలిసిందే. ఎనభై అయిదు కోట్ల రూపాయలకి ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ అమ్మగా, అరవై కోట్లు మాత్రం తిరిగి వచ్చేట్టున్నాయి. అంటే ఈ చిత్రంపై బయ్యర్లకి పాతిక కోట్లపైనే నష్టం వస్తుందన్నమాట. ఒక సినిమా నష్టాన్ని పూడ్చడానికి తీసిన సినిమాతో మరింత నష్టమొస్తే బయ్యర్లు ఊరుకుంటారా? అసలే తనని మోసం చేసారంటూ, సర్దార్‌తో రెండు కోట్లు నష్టపోతే కాటమరాయుడు రైట్స్‌ తనకి ఇవ్వలేదంటూ కృష్ణా జిల్లా పంపిణీదారుడు నిరాహారదీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మిగతా బయ్యర్లు ఊరుకునేలా లేరట.

'కాటమరాయుడు' ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందంటూ నమ్మబలికి తమకి అత్యధిక మొత్తాలకి అమ్మిన నిర్మాత శరత్‌ మరార్‌ని నిలదీయడానికి సిద్ధపడుతున్నారట. సర్దార్‌ నష్టాలు అటుంచి కాటమరాయుడుతో వచ్చిన కొత్త నష్టాలని అయినా భర్తీ చేయని పక్షంలో మీడియాకెక్కుతారట. ప్రస్తుతానికి ఇంకా నామమాత్రపు షేర్లు వస్తున్నాయి కనుక బిజినెస్‌ క్లోజ్‌ అయ్యేవరకు ఆగి ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకురావాలని యోచిస్తున్నారని ట్రేడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనిని తెర వెనుకే పరిష్కరించుకుని వారి నష్టాల్లో కొంతయినా తిరిగిచ్చేస్తే, ఈ మొత్తం వ్యవహారంలో పవన్‌కళ్యాణ్‌ మాట, పరువు దక్కుతాయని, లేదంటే ఇది తన పర్సనల్‌ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేస్తుందని చెప్పుకుంటున్నారు. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు