ఇంకా కోలుకోని దిల్ రాజు

ఇంకా కోలుకోని దిల్ రాజు

శతమానం భవతి, నేను లోకల్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఈ సక్సెస్‌లను ఆస్వాదిస్తున్న సమయంలోనే ఆయన కుటుంబంలో పెద్ద విషాదం చోటు చేసుకుంది. రాజు సతీమణి అనిత గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఇది రాజుకు కోలుకోలేని దెబ్బే. ఆయన ఆ రోజు నుంచి తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నారు. తన సినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ పక్కనబెట్టేసి ఇంటిపట్టునే ఉంటున్నారు రాజు. ఈ పాటికి రాజు కోలుకుంటాడని అనుకున్నారు కానీ.. ఇంకా ఆయన మామూలు మనిషి కాలేదట.

రాజు ఇంట్లో విషాదం నేపథ్యంలో గత నెల 17న ఆయన బేనర్ ద్వారా రావాల్సిన ‘వెళ్లిపోమాకే’ చిత్రాన్ని వాయిదా వేసేశారు. రాజు రిలీజ్ చేయాల్సిన మణిరత్నం సినిమా ‘చెలియా’ ఆడియో వేడుకలోనూ ఆయన కనిపించలేదు. ఈ నెల 7నే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రమోషన్ కూడా అంత బాగా ఏమీ జరగట్లేదు. రాజు ఫోకస్ పెట్టి ఉంటే ఈపాటికి సీన్ మరోలా ఉండేది.

ఐతే తెలుగులో వేరుగా రిలీజయ్యేట్లుంటే సినిమాను వాయిదా వేసేవారేమో కానీ.. తమిళంతో పాటే విడుదల కావాల్సి ఉండటంతో అందుకు అవకాశం లేదు. దీంతో లైట్‌గా ప్రమోట్ చేస్తూ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కాకపోతే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా ఇంకేదీ లేకపోవడం కలిసొచ్చే అంశం. పైగా మణిరత్నం సినిమా అంటే ప్రమోషన్‌తో సంబంధం లేకుండా జనాలు థియేటర్లకు వచ్చేస్తారు. ‘చెలియా’ ప్రోమోలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ చిత్ర ఫలితం రాజులో కొంత ఉత్సాహం తీసుకొచ్చి.. ఆయన్ని మళ్లీ మీడియా ముందుకు రప్పిస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు