నానా నిఖిల్.. ఈసారి జాగ్రత్తమ్మా!

నానా నిఖిల్.. ఈసారి జాగ్రత్తమ్మా!

'స్వామి రారా' దగ్గర్నుంచి తన కెరీర్ ను కొత్త పంథాలో నడిపిస్తున్నాడు యువ కథానాయకుడు నిఖిల్. తన సినిమా అనగానే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకులకు కలిగించాడతను. నిఖిల్ కొత్త సినిమా 'కేశవ' మీద కూడా మంచి అంచనాలున్నాయి. సక్సెస్ ట్రాక్‌ లో ఉన్నప్పటికీ హడావుడిగా సినిమాలు చేయట్లేదు నిఖిల్.

ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. 'కేశవ' తర్వాత అతను చందూ మొండేటితో నాగార్జున కాంబినేషన్లో సినిమా చేయాల్సి ఉంది. ఐతే అది సరిగ్గా ఎప్పుడు మొదలవుతుందన్న క్లారిటీ లేదు. ఈలోపు నిఖిల్ హీరోగా ఓ రీమేక్ తెరమీదికి రావడం విశేషం.

కన్నడలో ఈ మధ్యే రిలీజై సంచలన విజయం సాధించిన 'కిరిక్ పార్టీ' రీమేక్ లో నిఖిల్ నటిస్తాడని సమాచారం. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని 14 రీల్స్ వాళ్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పట్నుంచో దర్శకత్వ కలలు కంటున్న స్టార్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతాడట. ఈ రీమేక్ గురించి చెప్పగా నిఖిల్ కూడా పాజిటివ్ గానే స్పందించినట్లు తెలిసింది. నిఖిల్ ఇంతకుముందే ఒక రీమేక్ లో నటించాడు.

అదే.. శంకరాభరణం. ఐతే ఆ చిత్రాన్ని తెలుగు నేటివిటీ పేరు చెప్పి ఇష్టానుసారం మార్చేశాడు కోన వెంకట్. దీంతో అది కంగాళీగా తయారైంది. 'కిరిక్ పార్టీ' విషయంలో అలాంటి తప్పు జరక్కుండా జాగ్రత్త పడాలి నిఖిల్. స్ట్రెయిట్ సినిమాలతో మంచి ఫలితాలందుకుంటున్న నిఖిల్.. మరోసారి రీమేక్ సినిమాతో చేతులు కాల్చుకోడని ఆశిద్దాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు