'గురు' రేంజ్‌కి ఇది ఎక్కువే

'గురు' రేంజ్‌కి ఇది ఎక్కువే

'గురు' చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుంచి రెండున్నర కోట్లు వసూలయ్యాయి. ఈ షేర్‌ వెంకీ సినిమాకి అయితే తక్కువే కానీ, గురులాంటి ప్రయోగాత్మక చిత్రానికి ఎక్కువేనంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. ఈ చిత్రాన్ని వెంకటేష్‌ చేసే 'బాబు బంగారం' లాంటి కమర్షియల్‌ చిత్రాలతో పోల్చి చూడకూడదని, 'దృశ్యం'లాంటి చిత్రాల వసూళ్లతో పోల్చి చూసుకోవాలని, ఆ లెక్కన రెండున్నర కోట్ల షేర్‌ అంటే బాగా వచ్చినట్టేనని చెప్పారు.

ఈ చిత్రానికి సర్వత్రా మంచి టాక్‌ వచ్చిందని, కనుక శని, ఆదివారాల్లో వసూళ్లు బాగుంటాయని, ఓవరాల్‌గా పన్నెండు నుంచి పదిహేను కోట్ల షేర్‌ వసూలయినట్టయితే ఈ చిత్రం బాగా చేసినట్టేనని ట్రేడ్‌ సర్కిల్స్‌ అంటున్నాయి. ఈ చిత్రాన్ని అమ్మకపోవడం వల్ల బయ్యర్లు నష్టపోయేదంటూ ఏమీ వుండదని, పదిహేను కోట్లు వసూలయినట్టయితే, శాటిలైట్‌, ఇతర హక్కులు కలుపుకుంటే ఇరవై కోట్ల వరకు వస్తుంది కనుక లాభదాయకమైన ప్రాజెక్ట్‌ అవుతుందని వివరణ ఇచ్చాయి.

ఇలాంటి సినిమాలకి వెంకటేష్‌ పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోవడం నిర్మాతలకి కలిసి వస్తోంది. ఆయన ఒక అయిదు కోట్లు ఛార్జ్‌ చేసినట్టయితే నిర్మాతకి వర్కవుట్‌ కాదు కానీ లాభాల్లో వాటా అనేసరికి ఏడెనిమిది కోట్లలోనే ఈ తరహా చిత్రాలు తెరకెక్కేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు