ఏప్రిల్ 2న ఏపీకి కొత్త‌మంత్రులు..పేర్లు ఇవే

ఏప్రిల్ 2న ఏపీకి కొత్త‌మంత్రులు..పేర్లు ఇవే

సుదీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌ల్లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2న ఉద‌యం 9.25 గంట‌ల‌కు ఏపీ మంత్రివర్గ విస్తరణ  కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. అమ‌రావ‌తిలోని వెల‌గ‌పూడిలో గ‌ల నూతన సచివాలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

వివిధ వ‌ర్గాల ద్వారా వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం రెడ్డి-కాపు-బీసీ వ‌ర్గాల‌కు విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ద‌క్క‌నుంది. కొందరు కొత్త వారికి చాన్స్ ద‌క్క‌నుండ‌గా ప్ర‌స్తుత‌మున్న మంత్రుల్లో ఒక‌రిద్ద‌రి ప‌ద‌వులు ఊడిపోనున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏపీ మంత్రివ‌ర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి.  ఇవి క‌లుపుకొని కొంద‌రికి ఉద్వాస‌న ప‌ల‌క‌డం ద్వారా 10 మందికి చాన్స్ ద‌క్క‌వ‌చ్చంటున్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు లోకేష్ మంత్రి ప‌ద‌వి ఖాయ‌మైంది. ఆయ‌న‌కు ఐటీ, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ రాజ్ శాఖ‌ల‌లో ఏవైనా రెండు అప్ప‌గించే అవ‌కాశం ఉంది. పార్టీ మారిన వారిలో సుజ‌య కృష్ణా రంగారావు, భూమా అఖిల‌ప్రియ‌కు అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావుకు సైతం మంత్రి ప‌ద‌వి యోగం ద‌క్క‌వచ్చ‌ని పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ఇదిలాఉండ‌గా... సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్షం సమావేశం జ‌రిగింది. అసెంబ్లీ కమిటీ హాలులో జ‌రిగిన ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌, ఇతర ఎమ్మెల్సీలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగానే అసెంబ్లీలో ప్రతిభ కనబరిచిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబునాయుడు అవార్డులు ప్రకటించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, యరపతినేని, దూళిపాళ్ల, ఆనందరావు, నక్క ఆనంద్‌బాబు, బోండా ఉమామహేశ్వరరావులకు అవార్డులు ప్రకటించారు. పార్టీ బ‌లోపేతానికి, ప్ర‌తిప‌క్షాల‌ను దీటుగా ఎదుర్కునేందుకు కృషి చేయాల‌ని చంద్ర‌బాబు కోరారు.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు