కీరవాణిపై గీతరచయితల ఎటాక్ !

కీరవాణిపై గీతరచయితల ఎటాక్ !

బాహుబలి-2 ఆడియో వేదికపై నుంచి, తర్వాత ట్విట్టర్లోనూ కీరవాణి కొన్ని వివాదాస్పదవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వేటూరి, సీతరామశాస్త్రి తర్వాత తెలుగు సినిమా పాట అంపశయ్య ఎక్కింది అని ఆయన అన్నమాట పెద్ద దుమ్మారమే లేపుతోంది. ఇప్పటికే భాస్కరభట్ల ట్విట్టర్లో కీరవాణిని ఉద్దేశించి "అంపశయ్య మీద ఉన్న సినిమా పాటల సాహిత్యాన్ని కీరవాణి గారే కాపాడగలరు. ఆయన స్వీయసంగీతదర్శకత్వంలోనే కాకుండా వేరే సంగీత దర్శకులకీ పాటలు రాయాలని మనస్పూర్తిగా  కోరుకుంటున్నాను! వేటూరి, సిరివెన్నెల తరువాత నాకు బాగా నచ్చిన పాటల రచయిత కీరవాణి గారే!" అంటూ వ్యంగ్యబాణాలు వేసాడు.

నిన్న రాత్రి జనతాగ్యారేజ్ లో "ప్రణామం ప్రణామం" పాటకి ఐఫా అవార్డు అందుకున్న రామజోగయ్య శాస్త్రి కూడా కీరవాణి వ్యాఖ్యల్ని ఖండించాడు. మంచి సిట్వువేషన్ ఉంటే ఇప్పటి రైటర్స్ కూడా గొప్పగానే రాస్తారని, చెత్త సిట్వువేషన్ ఇస్తే సీతారామశాస్త్రి అయినా చెత్తగానే రాస్తారని అన్నాడు.

ఇక మరో గీతరచయిత సిరాశ్రీ ఫేసుకుబుక్కోలో కీరవాణిని, బాహుబలి పాటలో ఉన్న తప్పుల్ని చూపిస్తూ పెద్ద పోస్టే పెట్టాడు.

"హేస్సా రుద్రస్సా హేసరభద్ర సముద్రస్సా". ఇవి "సాహోరే బాహుబలి" పాటలో వినిపించే పదాలు. వీటికి అర్థం ఏమిటా అని తెగ ఆలోచించాను. ఏకాక్షరీ నిఘంటువు ఆధారంగా ఏమన్నా దొరుకుతుందా అని కూడా ప్రయత్నించాను. నాకు అందలేదు. ఒక ప్రముఖ అవధాని గారిని అడిగాను. "ఈ పదాలకి అర్థం లేదు" అని వారు కూడా తీర్మానించారు. మరెందుకు ఇలా ఉన్నాయి అని ఆలోచిస్తే అప్పుడు అనిపించింది...అర్థం లేకపోయినా కొన్ని పదాల్ని కేవలం సౌండ్ కోసం మ్యూజిక్ డైరెక్టెర్స్ సృష్టిస్తారు. ఇది ఖచ్చితంగా కీరవాణిగారి చేతివాటం అని సరిపెట్టుకున్నాను. ఎందుకంటే ఈ పాట వ్రాసింది కీరవాణి గారి తండ్రి గారు శ్రీ శివశక్తిదత్తా గారు. వారు గొప్ప తెలుగు-సంస్కృత కవి. గతంలో వారు వ్రాసిన "గగన గంగావతరణం" కావ్యం చదివాను. ఈ మధ్యే వారు వ్రాసిన "శ్రీమన్మహాకాళికా" సంస్కృతాంధ్రశతకం కూడా చదివాను. మంచి ధార, భాషాప్రౌఢి కలిగిన కవిత్వం ఆయనది. దశాబ్దాల క్రితం విశ్వనాథసత్యనారాయణగారి మెచ్చుకోలు సైతం పొందిన కవి అంటే ఇక అర్థం చేసుకోవచ్చు. అంతటి కవి వ్రాస్తున్నప్పుడు కచ్ఛితంగా అర్థరహితమైన పదాలు ఉండవు...ఉండనీయరు కూడా.
నాకు తెలిసి ఆయన "రుద్రః+సః" రుద్రస్సః అని వ్రాసి ఉండొచ్చు...అంటే "అతడే రుద్రుడు" అని. "సముద్రః+సః=సముద్రస్సః" అంటే "అతడే సముద్రుడు" అని. ఇలా ఉంటే చివర్లో విసర్గలు లేపేసి అర్థరహితం చేసారు సంగీత దర్శకులు అని అనిపించింది.
గతంలో కీరవాణి గారు శ్రీరామదాసు పాటలో "భద్రశైల రాజమందిర..శ్రీ రామచంద్ర బాహుమధ్యవిలసితేంద్రియా" అని పాడించారు. అది వాస్తవానికి "బాహుమధ్య విలసితేందిరా" (బాహుమధ్య విలసిత+ఇందిర= హృదయస్థానంలో లక్ష్మితో ఉన్నవాడు= విష్ణువు) అని రామదాసు వ్రాసాడు. తప్పు పాడించడం వల్ల అసలు అర్థమే లేకుండా పోయింది.
మామూలు మాస్ సినిమా పాటల్లో పదాలు కాస్త అటూ ఇటూ పడ్డా సౌండింగ్ కోసం చేసార్లే అనుకోవచ్చు. శ్రీరామదాసు, బాహుబలి లాంటి సినిమా విషయాల్లోనైనా జాగ్రత్త పడాలి కదా. సంగీత దర్శకుల నిర్ణయాలు గీతరచయితల ఇమేజ్ కి ఇబ్బంది వచ్చేలా ఉండకూడదు. అప్పుడు తెలుగు సినీసాహిత్యం అంపశయ్య ఎక్కదు".

రైటర్లంతా ఇలా బాణాలు వేస్తుంటే కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే కీరవాణి మ్యూజిక్ లో ఎక్కువగా పాటలు రాసిన చంద్రబోస్, అనంతశ్రీరాం లు ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఇక సీనియర్ రైటర్ సీతారామశాస్త్రి కూడా ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నారంటే కీరవాణి స్టేట్మెంటుని ఎంజాయ్ చెస్తున్నారనే అనుకోవాలేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు