పవన్-శరత్ జేబు నిండితే చాలా?

పవన్-శరత్ జేబు నిండితే చాలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి మూడు సినిమాలూ తన ఆప్త మిత్రుడు శరత్ మరార్‌క చేశాడు. ముందుగా సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ భాగస్వామ్యంలో ‘గోపాల గోపాల’ చిత్రాన్ని నిర్మించిన మరార్.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. వీటిలో ఏది కూడా బయ్యర్లకు సంతృప్తినివ్వలేదు.

ఉన్నంతలో ‘గోపాల గోపాల’ పర్వాలేదు. స్వల్ప నష్టాలతో బయటపడేసింది. కానీ గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ భారీ నష్టాలు మిగిల్చింది. ఇప్పుడు ‘కాటమరాయుడు’ కూడా ఆ కోవలోకే చేరేలా కనిపిస్తోంది. ‘సర్దార్’ అనుభవం తర్వాత కూడా ‘కాటమరాయుడు’ కోసం ఎగబడ్డ బయ్యర్లకు కోలుకోని దెబ్బ తగిలేలా ఉంది.

మామూలుగా ఒక సినిమా ఫ్లాప్ అయితే.. ఆ చిత్ర నిర్మాత, హీరోల తర్వాతి సినిమాపై ఆ ప్రభావం పడుతుంది. కానీ మరార్, పవన్‌లకు ఆ ఇబ్బంది లేకపోయింది. ముందు సినిమా ప్రభావం ఏమీ వీరిపై పడలేదు. ‘సర్దార్’, ‘కాటమరాయుడు’ సినిమాల్ని చాలా తక్కువ బడ్జెట్లో ముగించేసిన ఇద్దరు మిత్రులు.. బయ్యర్లకు మాత్రం భారీ రేట్లకు అమ్ముకున్నారు. వాళ్ల జేబులు బాగానే నిండాయి. ఈ రెండు సినిమాలకు పవన్ పాతిక కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్ల దాకా జేబులో వేసుకున్నట్లు చెబుతున్నారు. మరార్‌కు కూడా బాగానే ముట్టింది. మధ్యలో మునిగింది బయ్యర్లే.

ఇంతకుముందు ‘జానీ’ సినిమాకు నష్టాల పాలైన బయ్యర్లను ఆదుకున్న పవన్.. ‘సర్దార్’ బాధితుల్ని మాత్రం పట్టించుకోలేదు. ‘కాటమరాయుడు’ బయ్యర్ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. ఈ సినిమా బయ్యర్లను పట్టించుకుంటే ‘సర్దార్’ బాధితుల మీదా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. వాళ్లను పట్టించుకోలేదు కాబట్టి వీళ్లకూ మొండిచేయి తప్పదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు