బాహుబలి-2లో కీరవాణి కొడుకు అదుర్స్

బాహుబలి-2లో కీరవాణి కొడుకు అదుర్స్

‘బాహుబలి’లో రాజమౌళి కొడుకు ఎస్.ఎస్.కార్తికేయ ప్రమేయం గురించి అందరికీ తెలిసిందే. ఐతే ఈ సినిమా కోసం కీరవాణి కొడుకు కూడా పని చేశాడన్న సంగతి తెలిసింది కొందరికే. వారం కిందట బయటికి వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రాక్ కార్డును చూస్తే అందులో చివరి రెండు పాటల గాయకుడిగా కాలభైరవ అనే పేరును గమనించే ఉంటారు. ఆ కాలభైరవ మరెవరో కాదు.. కీరవాణి, వల్లిల ముద్దుల కొడుకే.

తండ్రి బాటలో సంగీతాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు కాలభైరవ. ‘మగధీర’ సినిమాలో హీరో పాత్రకు పేరు పెట్టేందుకు స్ఫూర్తిగా నిలిచింది కూడా ఈ కాలభైరవనే. తండ్రి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుని ఆయన చేతుల మీదుగా సినీ గాయకుడిగా అరంగేట్రం చేశాడు కాలభైరవ. అతను ‘బాహుబలి: ది బిగినింగ్’ హిందీ వెర్షన్లో ఓ పాట పాడటం విశేషం. తర్వాత ఇప్పుడు తెలుగులో పూర్తి స్థాయి గాయకుడిగా అరంగేట్రం చేశాడు.

కీరవాణే స్వయంగా రాసిన దండాలయ్యా.. ఒక ప్రాణం పాటల్ని ఆలపించాడు కాలభైరవ. రెండు పాటలతోనూ అతను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇందులో దండాలయ్యా పాట వింటే అది కీరవాణే పాడాడనిపిస్తుంది. అచ్చం తండ్రి వాయిస్ లాగే ఉంది కాలభైరవ గొంతు కూడా. ఆడియోలో మిగతా పాటలు కూడా బావున్నాయి. సాహోరే బాహుబలి.. దండాలయ్యా పాటలు వింటుంటే ఒకరకమైన ఉద్రేకం కలుగుతుంది. సినిమాలో ఈ పాటలు మరింత బాగా అనిపించే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు