ఈగ విలన్.. టైగర్ తో ఢీ

ఈగ విలన్.. టైగర్ తో ఢీ

‘ఈగ’ సినిమాతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించాడు కన్నడ నటుడు సుదీప్. ఈ సినిమాతో అతడికి గొప్ప పేరే వచ్చినప్పటికీ.. ఆ తర్వాత అతను పెద్దగా తెలుగు సినిమాలు చేయలేదు. అతడికి సరైన అవకాశాలు దక్కలేదా.. లేక తనే ఇక్కడి ఆఫర్లను తిరస్కరించాడా అన్నది తెలియదు. ఐతే తెలుగులో కంటే ముందు సుదీప్ హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు.

‘రక్తచరిత్ర’లో అతడికి కీలక పాత్ర ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఫూంక్, రణ్ లాంటి సినిమాల్లోనూ నటింపజేశాడు. ఆ సినిమాలు ఆడకున్నా సుదీప్ నటనకు మాత్రం అక్కడ మంచి పేరే వచ్చింది. ఐతే ‘రణ్’ తర్వాత హిందీలో ఇంకో సినిమా చేయని సుదీప్.. సుదీర్ఘ విరామం తర్వాత ఓ భారీ బాలీవుడ్ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో సుదీప్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. సల్మాన్ హీరోగా ఇటీవలే ‘టైగర్ జిందా హై’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఐదేళ్ల కిందట సూపర్ హిట్టయిన ‘ఏక్ థా టైగర్’ సినిమాకు సీక్వెల్ ఇది. తొలి భాగానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తే.. దీనికి ‘సుల్తాన్’ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫకర్ దర్శకుడు.

సల్మాన్ సరసన మళ్లీ కత్రినానే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సుదీప్ విలన్ పాత్ర చేస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఇంతకుముందు బాలీవుడ్లో సుదీప్ చేసినవి కీలక పాత్రలే కానీ.. ఇలా ఓ సూపర్ స్టార్ సినిమాలో విలన్ పాత్ర చేయడం మాత్రం ప్రత్యేకం. ఈ సినిమా హిట్టయి.. సుదీప్ మంచి పేరు సంపాదిస్తే అతను బాలీవుడ్లో బిజీ అయిపోయే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు