మినీ మ‌ల్టీస్టార‌ర్.. 31 రోజుల్లో అవ‌గొట్టేశారు

మినీ మ‌ల్టీస్టార‌ర్.. 31 రోజుల్లో అవ‌గొట్టేశారు

గ‌త ఏడాది ‘జెంటిల్‌మ‌న్’ సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. దీని త‌ర్వాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో సినిమా ప‌ట్టాలెక్కిన‌ట్లే ఎక్కి ఆగిపోయింది. ఆ త‌ర్వాత అత‌ను అడివి శేష్‌,అవ‌స‌రాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్‌ల కాంబినేష‌న్లో ఒక మినీ మ‌ల్టీస్టార‌ర్ మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలోనే సెట్స్ మీదికి వెళ్లిపోయింది. ఇంత‌లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యిపోయినట్లు ప్ర‌క‌టించేశాడు ఇంద్ర‌గంటి. కేవ‌లం 31 రోజుల్లోనే ఈ చిత్రం కంప్లీట్ అయిపోయింద‌ట‌.

‘‘నేను అత్యంత వేగంగా పూర్తి చేసిన సినిమాలో ఇది రెండవది, 31 రోజుల్లో షూట్ చేశాం. నాకు సహాయపడిన నా టీంకు కృతజ్ఞతలు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇతర పనులు చేయాల్సి వుంది’’ అని ఇంద్ర‌గంటి ప్ర‌క‌టించాడు. ఇటీవ‌లే ఈ చిత్రానికి ‘అమీతుమీ’ అనే టైటిల్ క‌న్ఫ‌మ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఎ గ్రీన్ ట్రీ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ మీద న‌ర‌సింహారావు, విన‌య్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘జెంటిల్‌మ‌న్‌’తో మెలోడీ బ్ర‌హ్మ ఈజ్ బ్యాక్ అనిపించిన మ‌ణిశ‌ర్మే ఈ చిత్రానికి కూడా సంగీతాన్నందిస్తున్నాడు. త‌న‌ ‘అంత‌కుముందు ఆ త‌రువాత‌’, ‘బందిపోటు’ సినిమాల్లో న‌టించిన ఈషానే ఈ చిత్రానికి కూడా క‌థానాయిక‌గా ఎంచుకున్నాడు ఇంద్ర‌గంటి. వేస‌విలోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవకాశ‌ముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు