దిల్ రాజు లేకుండా ఆ సినిమా వేడుక

దిల్ రాజు లేకుండా ఆ సినిమా వేడుక

తన ప్రొడక్షన్లో వచ్చే సినిమాలకు అన్నీ తానై వ్యవహరిస్తాడు దిల్ రాజు. ఆయన బేనర్ మీద సినిమా వస్తోందంటే హీరో హీరోయిన్ల.. దర్శకుడితో సమానంగా ఆయన కూడా హైలైట్ అవుతారు. ఆయనకున్న బ్రాండ్ నేమ్ అలాంటిది.

సినిమా ప్రమోషన్లలో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. దిల్ రాజు రిలీజ్ చేసే తమిళ డబ్బింగ్ సినిమాల్లో ఆయన పాత్ర ఇంకా కీలకం. ఐతే రాజు బేనర్లో రిలీజవుతున్న తమిళ డబ్బింగ్ మూవీ ‘చెలియా’ ఆడియో వేడుక మాత్రం ఆయన లేకుండా జరిగిపోయింది. మంగళవారం హైదరాబాద్‌లో రాజు లేకుండానే ఈ వేడుక నిర్వహించారు.

రెండు వారాల కిందట రాజు సతీమణి అనిత హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి రాజు ఇంకా కోలుకోలేదు. ఆయన ఇంటి నుంచి బయటికే రావట్లేదు. ఈ కారణంతోనే గత వారంతంలో దిల్ రాజు బేనర్ మీద రిలీజ్ కావాల్సిన ‘వెళ్లిపోమాకే’ను కూడా వాయిదా వేశారు. ఐతే ఏప్రిల్ 7న రాబోతున్న ‘చెలియా’ సినిమాను ఇప్పట్నుంచే ప్రమోట్ చేయక తప్పదు.

అందులో భాగంగానే ఆడియో వేడుక చేశారు. ఈ వేడుకకు వచ్చిన వాళ్లంతా రాజును తలుచుకున్నారు. మణిరత్నం.. సుహాసిని.. కార్తి.. ఇలా అందరూ రాజు కుటుంబంలో విషాదం గురించి ప్రస్తావించారు. ఆయనకు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి రాజు కొంచెం కోలుకుని.. మామూలు స్థితికి వస్తాడని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు