పవన్‌పై అజిత్ అభిమానులకు అంత ప్రేమా..

పవన్‌పై అజిత్ అభిమానులకు అంత ప్రేమా..

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లతో పోలిస్తే తమిళనాట సగం థియేటర్లే ఉంటాయి. అందుకే మన దగ్గర లాగా 1000.. 1500 థియేటర్లలో స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేయరక్కడ. పెద్ద సినిమాలు కూడా 500-600 థియేటర్లలో మాత్రమే రిలీజవుతాయి.

తమిళనాడులో రిలీజయ్యే తెలుగు స్టార్ హీరోల సినిమాలకు వంద లోపే థియేటర్లిస్తుంటారు. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ను మాత్రం 150కి పైగా థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ‘కాటమరాయుడు’కి మంచి బజ్ నెలకొంది. తొలి రోజు భారీగా బెనిఫిట్ షోలు కూడా పడుతున్నాయి. ఇప్పటిదాకా తెలుగులో రిలీజైన ఏ సినిమాకూ లేనంత హైప్ కనిపిస్తోంది ‘కాటమరాయుడు’కి.

ఇదంతా తమిళ స్టార్ అజిత్ అభిమానుల చలవే అంటున్నాడు ‘కాటమరాయుడు’ను తమిళంలో రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ నరేంద్రన్. తమ హీరో సినిమా అయిన ‘వీరం’ను పవన్ ‘కాటమరాయుడు’గా రీమేక్ చేయడంతో ఈ చిత్రాన్ని అజిత్ ఫ్యాన్స్ ఓన్ చేసుకుని.. పెద్ద ఎత్తున సినిమా రిలీజ్ చేయడానికి సహకరిస్తున్నట్లు.. ఈ సినిమాకు అక్కడ వాళ్లే హైప్ తీసుకొచ్చినట్లు నరేంద్రన్ తెలిపాడు.

‘‘అజిత్ అభిమానుల వల్లే ‘కాటమరాయుడు’ను ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. అజిత్ సినిమా ‘వీరం’కు రీమేక్ కావడంతో ఈ చిత్రాన్ని ఎక్కువమందికి చేరువ చేయాలని వాళ్లు భావించారు. సినిమా ప్రమోషన్‌కు కూడా అజిత్ అభిమానులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అజిల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెల్లవారుజామున వేసే షోలకు అజిత్ అభిమానులు పెద్ద ఎత్తున రాబోతున్నారు. మంచి ఓపెనింగ్స్ ఆశిస్తున్నాం’’ అని నరేంద్రన్ తెలిపాడు.