పీకే ఫాన్స్‌కి స్వీట్‌ షాకిచ్చిన టీవీ9 రవిప్రకాష్‌

పీకే ఫాన్స్‌కి స్వీట్‌ షాకిచ్చిన టీవీ9 రవిప్రకాష్‌

'పవన్‌కళ్యాణ్‌ని ఇష్టపడుతున్న వాళ్లల్లో నేనూ ఒకడ్ని' అంటూ టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌ అనేసరికి తాము విన్నది నిజమేనా అని ఒక్క క్షణం అభిమానులు నమ్మలేకపోయారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కి హెడ్‌ అయి వుండి, రాజకీయాలకి అతీతంగా అందరివాడు అనిపించుకోవాల్సిన మీడియా ప్రతినిధి అయి వుండి పవన్‌కళ్యాణ్‌పై రవిప్రకాష్‌ ప్రశంసలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో అన్యాయం జరిగితే ఎవరూ నోరు మెదపలేకపోయారని, మీడియా కూడా అడిగే ధైర్యం చేయలేదని, అలాంటిది పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించాడని, యువతరాన్ని కూడా ఆ దిశగా ఆలోచించేలా చేసాడని, అందుకే అతడిని తాను ఇష్టపడుతున్నానని రవిప్రకాష్‌ అన్నారు. అంతటితో ఆగలేదు, గత ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ పాత్ర ఏమిటనేది అరదరికీ తెలుసని, అదే వేరొకరు అయితే డబ్బు కోసమో, పదవి కోసమో చూసేవారని, కానీ పవన్‌ మాత్రం అలా చేయలేదని, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుని, ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాడని, వారి సమస్యల కోసం పోరాడుతున్నాడని ఆయన ప్రశంసించారు.

నిజం తరఫున నిలబడ్డానికి, నిజం మాట్లాడ్డానికి చాలా ధైర్యం కావాలని, పవన్‌కళ్యాణ్‌లో ఆ గుణమే అతడంటే తనకి ఇష్టం ఏర్పడేట్టు చేసిందని రవిప్రకాష్‌ చెప్పడంతో ఆడిటోరియం చప్పట్లతో హోరెత్తిపోయింది. పవన్‌ని పొగుడుతూ సినిమా వాళ్లు మాట్లాడడం మామూలే కానీ ఒక పవర్‌ఫుల్‌ మీడియా అధినేత ఇలా పొగడ్తలు కురిపిస్తోంటే ఫాన్స్‌ మురిసిపోయారు. రవిప్రకాష్‌ మాటలు పవన్‌ని కూడా కదిలించాయనే సంగతి ఆయన మాట్లాడుతున్నపుడు పవన్‌ కళ్లల్లోని తీక్షణతే చెప్పింది. అనూహ్య రీతిలో కాటమరాయుడు వేడుకకి టీవీ 9 రవిప్రకాష్‌ స్పీచ్‌ మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English