ఈసారి కమల్ లేకుండా రాజమౌలి సినిమా

ఈసారి కమల్ లేకుండా రాజమౌలి సినిమా

'మగధీర'తో దర్శకుడిగా ఒకేసారి శిఖరాల్ని అందుకున్నాడు రాజమౌళి. అప్పటిదాకా రాజమౌళి తీసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. 'మగధీర' మరో ఎత్తు. ఓ తెలుగు దర్శకుడు అలాంటి సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఇండియాలో అప్పటిదాకా అలాంటి సినిమా తీసిన దర్శకుడే లేడు. దీంతో ఒక్కసారిగా రాజమౌళిపై అంచనాలు పెరిగిపోయాయి. 'మగధీర' తర్వాత మరో విజువల్ వండర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.

కానీ ఆశ్చర్యకరంగా 'మర్యాదరామన్న' లాంటి కామెడీ మూవీ తీసి అందరికీ షాకిచ్చాడు జక్కన్న. 'మగధీర' తర్వాత పెరిగిన అంచనాల ఒత్తిడిని తట్టుకోవడం కష్టమే అని రాజమౌళి ఆ నిర్ణయం తీసుకున్నాడని అంతా అనుకున్నారు.
ఐతే 'మర్యాద రామన్న' తర్వాత రాజమౌళి మళ్లీ తనదైన శైలిలో 'ఈగ' తీశాడు. ఈసారి జక్కన్నపై మరింత అంచనాలు పెరిగాయి.

కానీ 'ఈగ' తర్వాత మరో 'మర్యాదరామన్న' చేయకుండా.. 'బాహుబలి' లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఈ సినిమా తర్వాత జక్కన్న స్థాయి ఎంత పెరిగిందో.. ఆయన తర్వాతి సినిమాపై జనాలు ఎంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఐతే ఇప్పుడు రాజమౌళి మళ్లీ ప్రెజర్ ఫీలవుతున్నాడో ఏమో.. మళ్లీ ఇంకో 'మర్యాదరామన్న' చేస్తానంటున్నాడు. 'బాహుబలి: ది కంక్లూజన్' తర్వాత గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేని సినిమా చేయాలనుకుంటున్నట్లు రాజమౌళి తెలిపాడు.

'ది కంక్లూజన్' ట్రైలర్ లాంచ్ సందర్భంగా.. ఈ సినిమాకు వీఎఫెక్స్ సూపర్ వైజర్‌గా పని చేసిన కమల్ కణ్ణన్‌ను చూపిస్తూ.. ఆయన అవసరం లేని సినిమా చేయాలనుందన్నాడు జక్కన్న. కొన్ని రోజుల పాటు అసలు సినిమాల గురించి ఆలోచించకూడదని కూడా అనుకుంటున్నట్లు చెప్పాడు. మరి సరదాకే అన్నాడో.. నిజంగానే ఒక 'మామూలు' సినిమానే చేయాలని అనుకుంటున్నాడో కానీ.. ఆయన ఏ సినిమా చేసినా జనాలు ఆసక్తిగా చూస్తారనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు