ఆ ముగ్గురు చకచకా సినిమాలు చేస్తున్నారెందుకు?

ఆ ముగ్గురు చకచకా సినిమాలు చేస్తున్నారెందుకు?

సినిమా ఇండస్ట్రీ మీదా.. అందులో జరుగుతున్న విశేషాల మీద ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్న సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ. ఈ మధ్యన కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన దినపత్రికల్లో (తెలుగు కాదు) టాలీవుడ్ అగ్ర హీరోలు చిరు..పవన్.. బాలయ్యలు వరుసగా సినిమాలు ఎందుకు చేస్తున్నారెందుకు? అన్న అంశంపైన విశ్లేషణలు చేస్తున్నాయి.

2019 ఎన్నికల సమయానికి వీలైనన్ని సినిమాలు చేసేసి.. పాలిటిక్స్ లో బిజీ అవ్వాలన్నది వారి ఆలోచన అని..ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి హడావుడి ఉన్న నేపథ్యంలో.. ముందుగా మూడేసి సినిమాలు చకచకా చేసేద్దామని ఫిక్స్ అయినట్లుగా రాసుకొచ్చారు. అయితే.. ఈ కథనాల్ని ప్రస్తావించకుండా.. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ అంటూ..తమ్మారెడ్డి ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయ్యారు.

తన లాగా ఉండే వారు.. ఇలాంటి అంశాల్ని ప్రస్తావిస్తూ ఉంటారని.. అయితే ఎన్నికల కోసమే మూడేసి సినిమాల్ని స్పీడ్ గా చేసేస్తున్నారనటం సరి కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నా సినిమాలు చేయొచ్చని.. ఏమీ ఇబ్బంది ఉండదన్న ఆయన.. ఇప్పుడంటే  ఒక్కొక్క సినిమా చేస్తున్నారు కానీ.. గతంలో చిరంజీవి.. బాలకృష్ణలు ఏడాదిలో నాలుగైదు సినిమాలు కూడా చేసే వారని.. అప్పుడెప్పుడూ మీరు ఎందుకు ఇన్నేసి సినిమాలు చేస్తున్నారని అడగలేదన్న తమ్మారెడ్డి..  రాజకీయాల కోసమే స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారన్న వాదన సరైంది కాదని తేల్చేశారు.

సినిమా కెరీర్ కు.. రాజకీయ కెరీర్ కు సంబంధం లేదని తేలిపోయిందని.. సినిమా కెరీర్ లో సూపర్ స్టార్లుగా ఉన్నోళ్లు రాజకీయాల్లో ఫెయిల్ కావొచ్చని.. మళ్లీ సినిమాల్లోకి వచ్చి సూపర్ స్టార్లు కావొచ్చని తేలిందన్నారు. ‘‘రాజకీయాలు రాజకీయాలే. సినిమాలు సినిమాలే. రాజకీయాల కోసమే మూడేసి సినిమాలు చేస్తున్నారనటం తప్పు. రాజకీయాలు చేస్తూ సినిమాలుచేయొచ్చు. ఒకాయన ఎంపీ.. ఒకాయన ఎమ్మెల్యే.. ఒకాయన ప్రజలు చాలా మెచ్చుకున్న హీరో. రాజకీయంగా చాలామంది ఫాలో అవుతున్న వారు. మూడు సినిమాలు చేస్తారా? 30సినిమాలుచేస్తారా అన్నది అనవసరం’’అని అన్నారు.

ఈ మధ్యన సినిమా మేకింగ్ లోచాలా మార్పు వచ్చిందన్నారు. తమిళ్..కన్నడ సినిమాల్లో కథల విషయాల్లో చాలా మార్పు వచ్చేసిందని.. అదే తీరులో తెలుగు సినిమా కూడా మేకింగ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంతో పోలిస్తే.. అక్కడక్కడా ఒకట్రెండు సినిమాల్లో మార్పు కనిపిస్తున్నా.. ఈ ధోరణి మరింత పెరగాల్సిన అవసరం ఉందని తమ్మారెడ్డి చెప్పారు. ఆయన కోరుకున్నది జరిగితే సినిమా ప్రేక్షకుడికి కావాల్సిందేముంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు