కాటమరాయుడు ఏ కేటగిరిలోకి చేరతాడో..

కాటమరాయుడు ఏ కేటగిరిలోకి చేరతాడో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభం నుంచి కూడా ఏదో డిఫరెంట్‌గా.. క్రియేటివ్‌గా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి హీరో కెరీర్లో రీమేక్ సినిమాలు చాలానే ఉండటం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, అన్నవరం, తీన్ మార్, గబ్బర్ సింగ్.. ఇవన్నీ కూడా రీమేక్‌లే. వీటిలో సగం సినిమాలు బాగా ఆడితే.. సగం దెబ్బ కొట్టాయి. విశేషం ఏంటంటే పవన్‌కు రీమేక్స్ సరిగ్గా వర్కవుటైతే వాటి రేంజే వేరుగా ఉంటుంది. సుస్వాగతం, ఖుషి, గబ్బర్ సింగ్.. ఆయా సమయాల్లో పవన్‌కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి.

ముఖ్యంగా ఖుషి, గబ్బర్ సింగ్ సినిమాల్ని పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు.. తెలుగు నేటివిటీకి తగ్గట్లు చక్కగా మార్చడంతో అవి సెన్సేషనల్ హిట్లయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ చేసిన తాజా రీమేక్ ‘కాటమరాయుడు’ కూడా ఆ కేటగిరిలోకి చేరుతుందా లేదా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
నిజానికి ‘కాటమరాయుడు’ మొదలైపుడు.. ఇది ‘వీరం’కు రీమేక్ అని తెలిసినపుడు జనాలకు పెద్దగా ఎగ్జైట్మెంట్ లేదు. ఒకప్పట్లా రీమేక్‌లు ఇప్పుడు నడవట్లేదు.

జనాలకు ముందే ఒరిజినల్‌కు సంబంధించిన విశేషాలన్నీ తెలిసిపోతున్నాయి. ఉన్నదున్నట్లు దించేస్తే రీమేక్స్‌ అస్సలు వర్కవుట్ కావు. ఇంకేదో మ్యాజిక్ చేయాలి. ‘వీరం’ సినిమా ఉన్నదున్నట్లు తీసేస్తే ఆడటం కష్టమే. ఐతే పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్పులు జరిగినట్లు.. కథను కూడా కొత్తగా చెబుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. టీజర్.. ప్రోమోలు చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయి.

మరి డాలీ అండ్ కో ‘వీరం’ను ఎలా మార్చిందో.. సినిమాలో పవన్‌ను ఎలా చూపించిందో.. ‘కాటమరాయుడు’ను ఎలా తీర్చిదిద్దిందో చూడాలి. ఈ చిత్రం సుస్వాగతం, ఖుషి, గబ్బర్ సింగ్‌ల కోవలోకి చేరుతుందా లేక మిగతా రీమేకుల జాబితాలోకి చేరుతుందా అన్నది ఈ నెల 24న తేలుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు