కిషోర్.. పూరి.. క్రిష్.. నెక్స్ట్ ఎవరమ్మా?

కిషోర్.. పూరి.. క్రిష్.. నెక్స్ట్ ఎవరమ్మా?

విక్టరీ వెంకటేష్ ‘గురు’ సినిమాను పూర్తి చేసి మూడు నెలలవుతోంది. కానీ ఆయన తర్వాతి సినిమా దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ‘గురు’ సెట్స్ మీద ఉండగానే వెంకీ.. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమాకు కమిటయ్యాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇంతలో పూరి జగన్నాథ్‌ లైన్లోకి వచ్చాడు.

ఒక టైంలో వెంకీ-పూరి కాంబినేషన్లో సినిమా పక్కా అంటే పక్కా అన్నారు. ఇందుకోసం వెంకీనే స్వయంగా బడ్జెట్ కూడా సమకూరుస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ మధ్యలో ఏమైందో తెలియదు. పూరి బాలయ్య వైపు వెళ్లిపోయాడు. చివరికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దర్శకుడు క్రిష్.. వెంకీ కోసం ఓ కథతో వచ్చాడు. కానీ దాని మూల కథకు సంబంధించిన నవల హక్కులు దొరక్కపోవడంతో క్రిష్ వెనక్కి తగ్గాడు. దీంతో ఇప్పడు వెంకీ పరిస్థితి ఎటూ పాలుపోకుండా ఉంది.

‘గోపాల గోపాల’ తర్వాత ఇలాగే ఏ సినిమా కుదరక ఏడాదికి పైగా ఖాళీగా ఉండిపోయాడు వెంకీ. ఐతే ‘బాబు బంగారం’ దగ్గర్నుంచి ఇక ఆగకుండా సినిమాలు చేయాలనుకున్నాడు. అందుకే ఆ చిత్రం సెట్స్ మీద ఉండగానే ‘గురు’ను లైన్లో పెట్టాడు. కానీ ఈ సినిమా తర్వాత మాత్రం బ్రేక్ వచ్చేసింది. స్టార్ డైరెక్టర్లందరూ కూడా వేర్వేరు కమిట్మంట్లతో తీరిక లేకుండా ఉన్నారు. మీడియం రేంజి డైరెక్టర్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంకీ తర్వాతి సినిమా కోసం ఎవరు ముందుకొస్తారో.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు