ఇంద్ర‌గంటి భ‌లే టైటిల్ పెట్టాడులే..

ఇంద్ర‌గంటి భ‌లే టైటిల్ పెట్టాడులే..

గ్ర‌హ‌ణం.. మాయాబ‌జార్.. అష్టా చెమ్మా.. అంత‌కుముందు ఆ త‌రువాత‌.. బందిపోటు.. ఇలాంటి అంద‌మైన.. అచ్చ తెలుగు టైటిళ్ల‌తో ఆక‌ట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ‌. తన సినిమాల్లో తెలుగుద‌నానికి పెద్ద పీట వేసే ఇంద్ర‌గంటి.. ఈ మ‌ధ్యే మొద‌లుపెట్టిన త‌న త‌ర్వాతి సినిమాకు కూడా చ‌క్క‌టి తెలుగు పేరే పెట్టాడు. అమీ తుమీ.. ఇదీ ఇంద్ర‌గంటి కొత్త సినిమా టైటిల్. ఈ చిత్రంలో అడివి శేష్‌,అవ‌స‌రాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ ప్ర‌క‌టిస్తూ లోగో కూడా లాంచ్ చేశారు. ఆ లోగో కూడా క్రియేటివ్‌గా ఉంది.

అమ్మాయిల కోసం హీరోల మ‌ధ్య జ‌రిగే అమీతుమీ ఇద‌ని ఈ టైటిల్ లోగో చూస్తే అర్థ‌మ‌వుతుంది. అక్ష‌రాల్లోనే అమ్మాయిల్ని పొందుప‌రిచి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు ఇంద్ర‌గంటి. ‘అంత‌కుముందు ఆ త‌రువాత‌’, ‘బందిపోటు’ సినిమాల్లో న‌టించిన ఈషానే ఈ చిత్రానికి కూడా క‌థానాయిక‌గా ఎంచుకున్నాడు ఇంద్ర‌గంటి. ఎ గ్రీన్ ట్రీ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ మీద న‌ర‌సింహారావు, విన‌య్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జెంటిల్‌మ‌న్‌’తో మ‌ళ్లీ త‌న ముద్ర చూపించిన మ‌ణిశ‌ర్మే ఈ చిత్రానికి కూడా సంగీతాన్నందిస్తున్నాడు. ‘జెంటిల్‌మ‌న్’ స‌క్సెస్ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా అనుకుని.. దాన్ని ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయిన ఇంద్ర‌గంటి.. ఈ సినిమాను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు