ఖాన్స్‌తో సినిమా.. కంగనా భలే చెప్పిందిలే

ఖాన్స్‌తో సినిమా.. కంగనా భలే చెప్పిందిలే

బాలీవుడ్లో కథానాయికగా పరిచయమయ్యే ప్రతి హీరోయిన్ అంతిమ లక్ష్యం ఖాన్ త్రయంతో పని చేయడమే. వాళ్లతో సినిమా చేయాలంటే ఒక రేంజి ఉండాలి. వాళ్లతో పని చేశాక హీరోయిన్ల రేంజ్ మరింత పెరుగుతుంది. అందుకే అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్‌లతో పని చేయడానికి బాలీవుడ్ హీరోయిన్లు తహతహలాడిపోతుంటారు. ఐతే కంగనా రనౌత్ మాత్రం ఇందుకు మినహాయింపే అని చెప్పాలి. ఎంత పెద్ద హీరో గురించైనా తేలిగ్గా మాట్లాడే కంగనా.. తాజాగా రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో ఖాన్ త్రయం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఖాన్స్‌తో సినిమా చేయడం వల్ల కొత్తగా నాకొచ్చే ప్రయోజనమేంటి అని సూటిగా అడిగేసింది కంగనా. తనకు ఆల్రెడీ హీరోలతో సమానంగా ఇమేజ్ ఉందని.. మరి ఖాన్‌లతో సినిమా చేయడం వల్ల అంతకంటే పెద్ద ఇమేజ్ వస్తుందా అని కంగనా ప్రశ్నించింది. ఖాన్‌ల సినిమాలు చాలా వరకు హీరోల చుట్టూనే తిరుగుతుంటాయని.. హీరోయిన్లు మరుగున పడిపోతారని.. ఎంత పారితోషకం ఇచ్చినప్పటికీ ఆ సినిమాల వల్ల పేరైతే రాదని కంగనా తేల్చేసింది.

‘క్వీన్’ సినిమా చేయడానికి ముందు వరకు తాను కూడా ఖాన్ త్రయంతో నటించాలని తహతహలాడిపోయానని.. కానీ ఆ సినిమా తర్వాత తన దృక్పథం మారిందని.. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ తర్వాత అయితే ఆ ఆలోచన పూర్తిగా కట్టిపెట్టేశానని కంగన తెలిపింది. ఐతే ఖాన్స్‌తో సినిమా చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేయకున్నా.. వాళ్లతో పని చేసే అవకాశం వస్తే మాత్రం వద్దని చెప్పనని కంగన అంది. ఖాన్స్ ముగ్గురిలో అమీర్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమని.. సినిమాలు.. కథల గురించి తనతో అతను తరచుగా మాట్లాడుతుంటాడని కంగన తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు