ఫ్లాపుల మోత.. అయినా ఇంకో ఛాన్స్

ఫ్లాపుల మోత.. అయినా ఇంకో ఛాన్స్

పవన్ కళ్యాణ్‌తో పని చేసిన హీరోయిన్ల కంటే కూడా ఆయన సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నట్లే దక్కించుకుని చేజార్చుకున్న అనీషా ఆంబ్రోస్‌కు ఎక్కువ ప్రచారం లభించింది. ‘అలియాస్ జానకి’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమైన ఈ అమ్మాయిని ‘గబ్బర్ సింగ్-2’కు హీరోయిన్‌గా ఎంచుకుని పెద్ద షాకిచ్చాడు పవన్ కళ్యాణ్. ఐతే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లో ఏమో.. ఆమెను తప్పించేసి కాజల్‌కు అవకాశం కల్పించాడు పవన్. పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కోల్పోయిందన్న ప్రచారంతో అనీషా పేరు అప్పట్లో మీడియాలో బాగానే మార్మోగింది.

ఆ ప్రచారంతో అమ్మడికి రెండు అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి.. సందీప్ సరసన చేసిన ‘రన్’. ఆ సినిమా వచ్చింది తెలియదు.. వెళ్లింది తెలియదు. ఆ తర్వాత ‘మనమంతా’ అనే మంచి సినిమాలో నటించింది అనీషా. కానీ ఆ సినిమాకు ప్రశంసలు మాత్రమే దక్కాయి. రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. ఈ దెబ్బతో అనీషా మీద ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. అయినప్పటికీ అనీషా ఆశలు వదులుకోలేదు. కొంచెం గ్యాప్ తర్వాత మరో అవకాశం ఆమె తలుపు తట్టింది. మంచు మనోజ్ హీరోగా అజయ్ నూతక్కి అనే దర్శకుడు రూపొందిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’లో అనీషా ఓ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రెజీనా మరో హీరోయిన్‌గా చేస్తోంది. ‘ఒక్కడు మిగిలాడు’లో అవకాశం దొరకడం పట్ల అనీషా చాలా ఎగ్జైట్ అయిపోతూ సోషల్ మీడియాలో స్పందించింది. మరి ఆమె ఎగ్జైట్మెంట్‌కు తగ్గ రిజల్ట్ వస్తుందా.. ఈసారైనా ఆమె హిట్ కొడుతుందా.. చూద్దాం. ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English