సూపర్ స్టార్ లారెన్స్.. పెద్ద రచ్చే అయ్యిందే

సూపర్ స్టార్ లారెన్స్.. పెద్ద రచ్చే అయ్యిందే

దేశంలో ఎందరో పెద్ద స్టార్లున్నారు. ఐతే సూపర్ స్టార్ అనగానే ఎక్కువమందికి గుర్తుకొచ్చేది మాత్రం రజినీకాంతే. ఆయనే అసలు సిసలు సూపర్ స్టార్ అని బాలీవుడ్ బడా స్టార్లు కూడా ఒప్పుకుంటారు. తెలుగు వరకు ఒకప్పుడు కృష్ణ సూపర్ స్టార్‌గా ఉన్నారు కానీ.. ఆయన శకం ముగిశాక మన ప్రేక్షకులకు కూడా సూపర్ స్టార్ అనగానే రజినే గుర్తొస్తారు. ఇక తమిళనాట పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే రెండు రోజుల కిందట తమిళంలో విడుదలైన ‘మొట్ట శివ కెట్ట శివ’ సినిమా టైటిల్స్‌లో లారెన్స్ పేరు ముందు ‘మక్కల్ సూపర్ స్టార్’ అని వేయడం పెద్ద దుమారమే రేపింది. మక్కల్ అంటే ప్రజలని అర్థం. అంటే లారెన్స్ ప్రజల సూపర్ స్టార్ అన్నమాట.

లారెన్స్ ప్రజల సూపర్ స్టార్ అయితే.. రజినీ ఎవరికి సూపర్ స్టార్ అంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. తాను రజినీకి పెద్ద అభిమానినని చెప్పుకునే లారెన్స్ ఇలా బిల్డప్ ఇచ్చుకున్నాడేంటి అని సోషల్ మీడియాలో అతడి మీద నెగెటివ్ కామెంట్లు వేశారు సూపర్ స్టార్ అభిమానులు. ఐతే ఇదంతా తనకు తెలియకుండా జరిగిపోయిందంటూ లారెన్స్ వివరణ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో రజినీ ఒక్కడే సూపర్ స్టార్ అని.. దర్శకుడు సాయి రమణి విడుదలకు ముందు నాకో సర్ప్రైజ్ ఉందని చెప్పాడని.. అది ఇదే అని తనకు తెలియదని.. వెంటనే తన పేరు ముందు ఆ మాట తొలగించాలని స్పష్టం చేశానని లారెన్స్ అన్నాడు.

తన పేరు ముందు పెట్టాలనుకుంటే తన తల్లి కణ్మణి పేరు పెట్టమని.. అంతే తప్ప ఇలాంటి బిరుదులు వద్దని అతను తేల్చి చెప్పాడు. మరోవైపు సూపర్ స్టార్ అభిమానుల ఆగ్రహం చూసి దర్శకుడు సాయిరమణి కూడా వివరణ ఇచ్చాడు. తామిచ్చిన సర్ప్రైజ్ లారెన్స్‌కు నచ్చలేదని.. అతను తనకు ఫోన్ చేసి మందలించాడని.. సేవా కార్యక్రమాలతో జనాలకు ఎంతో సాయపడుతుండటంతో అభిమానం కొద్దీ లారెన్స్ పేరు ముందు ‘మక్కల్ సూపర్ స్టార్’ అని వేశామని.. రజినీ అభిమానులు మరోలా అనుకోవద్దని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English