మళ్లీ గౌతమ్ మీనన్-చైతూ కాంబో

మళ్లీ గౌతమ్ మీనన్-చైతూ కాంబో

గౌతమ్ మీనన్-అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకుల మనసులు పులకరిస్తాయి. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘ఏమాయ చేసావె’ మన ప్రేక్షకులపై ఎలాంటి ముద్ర వేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ వీళ్లిద్దరూ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రానికి జత కట్టారు. ఈ సినిమా కూడా ప్రథమార్ధం వరకు బాగానే అనిపిస్తుంది కానీ.. రెండో అర్ధంలో ట్రాక్ తప్పింది. పెద్ద నోట్ల రద్దు టైంలో విడుదల కావడం ఈ సినిమాపై ప్రభావం చూపి చివరికిది ఫ్లాప్‌ అయి కూర్చుంది. ఐతే ఇప్పుడు గౌతమ్-చైతూ మళ్లీ జత కట్టబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది. కాకపోతే ఇక్కడో ట్విస్టుంది.

ఈసారి చైతూ.. గౌతమ్ దర్శకత్వంలో సినిమా చేయట్లేదు. గౌతమ్ నిర్మాణంలో ఓ యువ దర్శకుడు చేయబోయే సినిమాలో అతను నటిస్తున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘ధృవంగల్ పదినారు’ (తెలుగులో 16 పేరుతో విడుదలవుతోంది) చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన కార్తీక్ నరేన్.

తొలి సినిమాతోనే కోలీవుడ్ దృష్టిని ఆకర్షించిన నరేన్‌తో పని చేయడానికి చాలామంది ముందుకొచ్చారు. అందులో గౌతమ్ మీనన్ కూడా ఒకడు. తన తొలి సినిమా తరహాలోనే ఇంకో రెండు థ్రిల్లర్లు తీయడానికి కార్తీక్ సన్నాహాలు చేసుకున్నాడు. అందులో భాగంగా చేయబోయే తర్వాతి సినిమాలో అరవింద్ స్వామి.. నాగచైతన్య నటిస్తారు. ఇది ఒకేసారి తెలుగు.. తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కార్తీక్‌తో కలిసి గౌతమ్ నిర్మించబోతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు