తమన్.. ఏం తాగి కొట్టావయ్యా

ఏదైనా సినిమాలో మంచి పాటలు, నేపథ్య సంగీతం ఉంటే.. ఆ సంగీత దర్శకుడి పేరు పెట్టి ‘‘ఏం తాగి కొట్టావయ్యా’’ అంటూ వ్యాఖ్యానించడం ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండ్. కొంత కాలంగా ప్రధానంగా ఈ కామెంట్లలో వినిపిస్తున్న పేరు తమన్‌దే. తాజాగా ‘వకీల్ సాబ్’తో మరోసారి తమన్ ఇలాంటి కామెంట్లలో మునిగి తేలుతున్నాడు. నిన్న ఫస్ట్ షో పడ్డప్పటి నుంచి అతడి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

ఒకప్పుడు ఊకదంపుడు సంగీతంతో విమర్శలు ఎదుర్కొని, సోషల్ మీడియాలో ఎంతో ట్రోల్‌కు గురైన తమన్.. కొన్నేళ్ల కిందట తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని అదిరిపోయే ఆడియోలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌లతో హవా సాగిస్తున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ విషయానికి వస్తే.. విడుదలకు ముందే అతడి పాటలు మార్మోగిపోయాయి. మగువా మగువా, సత్యమేవ జయతే, కంటి పాప పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సినిమాలో ప్రతి పాటా సందర్భానుసారం రావడం.. వాటి టేకింగ్ కూడా బాగుండటంతో తమన్ పనితనం మరింతగా హైలైట్ అయింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా హైలైట్ కాలేదు. పవన్ ఇంట్రో సీన్ దగ్గర మొదలుపెడితే.. పతాక సన్నివేశం వరకు ఆర్ఆర్ హైలైట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ముంగిట వచ్చే ట్రైన్ ఫైట్లో.. ఆ ఫైట్ ముగిశాక పవన్ ముగ్గురమ్మాయిలతో కలిసి బయటికి నడుచుకు వచ్చే సన్నివేశంలో స్కోర్‌కు థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. దీని మీద వందల సంఖ్యలో మీమ్స్ వస్తున్నాయి నిన్నట్నుంచి.

తమన్‌‌కు పవన్ ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎలివేషన్ ఇస్తున్నారు. కెరీర్లోనే బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా ‘ది బెస్ట్’ ఔట్ పుట్ ఇచ్చాడంటూ అతన్ని పొగుడుతున్నారు. కథను అర్థం చేసుకుని పాటలు, నేపథ్య సంగీతం ద్వారా ఒక మూడ్ క్రియేట్ చేయడంలో తమన్ చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తమన్ కెరీర్లో ‘అరవింద సమేత’ ఈ విషయంలో ఒక ఉదాహరణగా ఉండేది. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సైతం ఆ కోవలో చేరింది.