ఉగాదికి రామ్ చరణ్ సర్ప్రైజ్?

ఉగాదికి రామ్ చరణ్ సర్ప్రైజ్?

ఒక టైంలో రొటీన్ మాస్ మసాలా సినిమాలకే పరిమితం అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఐతే మూసలోంచి బయటికి వచ్చి చేసిన ‘ధృవ’తో అతడి కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. ట్రెండుకు తగ్గట్లుగా తనను తాను బాగానే మార్చుకున్నాడు చరణ్. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలతోనూ తాను మెప్పించగలనని చాటుకోవడంతో సుకుమార్ కూడా కాన్ఫిడెంటుగా రంగంలోకి దిగేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాపై ఇప్పటికే జనాల్లో ఎంతో క్యూరియాసిటీ ఉంది. దీని తర్వాత కూడా రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు. కొరటాల శివ.. గౌతమ్ మీనన్.. మణిరత్నం లాంటి దర్శకులతో పని చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు చరణ్.

పై ముగ్గురిలో చరణ్ ముందుగా ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్. ఐతే ఇప్పుడు మణిరత్నం రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మణిరత్నం సతీమణి సుహాసిని.. చిరంజీవి షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో పాల్గొన్న సందర్భంగా రామ్ చరణ్ తోనూ మీటింగ్ జరిగినట్లు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ కూడా మణిని కలిసినట్లుగా తమిళ మీడియాలోనూ వార్తలొస్తున్నాయి. వయబిలిటీస్ అన్నీ చూసుకుని సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

చరణ్ ఇంతకుముందే మణిరత్నంతో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. ఇద్దరి మధ్య డిస్కషన్స్ నడిచాయి. కానీ సినిమా పట్టాలెక్కలేదు. ఐతే మణిరత్నం మాట ప్రకారమే తాను వైవిధ్యమైన సినిమాల వైపు మళ్లినట్లుగా చెప్పుకున్నాడు చరణ్. ప్రస్తుతం ‘కాట్రు వేలయిదే’ (తెలుగులో చెలియా)కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్న మణిరత్నం.. చరణ్ తోనే తన తర్వాతి సినిమాను మొదలుపెట్టనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉగాదికి ఈ ప్రాజెక్టు గురించి సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చని వార్తలొస్తున్నాయి. మరి నిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు