164 కోట్ల గ్రాస్.. షేర్ 70 కోట్లేనా?

164 కోట్ల గ్రాస్.. షేర్ 70 కోట్లేనా?

ఎట్టకేలకు ‘ఖైదీ నెంబర్ 150’ థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా గ్రాస్ వివరాల్ని అధికారికంగా ప్రకటించేశాడు నిర్మాత రామ్ చరణ్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.164 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని.. సౌత్ ఇండియాలో సింగిల్ లాంగ్వేజ్‌లో రిలీజైన సినిమాల్లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రం ఇదేనని రికార్డును ఘనంగా ప్రకటించుకున్నారు.

ఐతే సినిమా కలెక్షన్లకు సంబంధించి గ్రాస్ కంటే కూడా షేర్ అన్నదే కీలకం. పబ్లిసిటీ.. థియేటర్ల రెంట్లు.. పన్నులు అన్నీ పోగా నికరంగా ఎంత షేర్ వచ్చిందన్నదాన్ని బట్టే ఓ సినిమా హిట్టా సూపర్ హిట్టా.. ఫ్లాపా అట్టర్ ఫ్లాపా.. అన్నది తేలుతుంది. ఐతే ‘ఖైదీ నెంబర్ 150’ స్థాయి ఏంటో అధికారికంగా తెలుసుకుందామంటే షేర్ వివరాలు వెల్లడించలేదు.

ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఈ చిత్రం రూ.104 కోట్లు వసూలు చేసిందని అంచనా. ఐతే చిత్ర బృందం షేర్ ఎంత అన్నది అధికారికంగా ప్రకటించలేదు. ఐతే రామ్ చరణ్ ఆదాయపు పన్ను అధికారులకు రూ.70 కోట్ల షేర్ చూపించి పన్ను కట్టినట్లుగా ఆ మధ్య వార్తలొచ్చాయి. మరి 164 కోట్ల గ్రాస్ అంటే షేర్ కేవలం రూ.70 కోట్లేనా అన్నది సందేహం. గ్రాస్ వసూళ్లలో 40 శాతం ఖర్చులకు పోయిందన్నా రూ.96 కోట్ల దాకా షేర్ ఉండాలి. 50 శాతం అనుకున్నా కూడా 82 కోట్లు షేర్ రావాలి.

కానీ ఆదాయపు పన్ను అధికారులకు 70 కోట్ల షేర్ లెక్కలు మాత్రమే చూపించి పన్ను కట్టి ఉంటే మాత్రం ఆ లెక్కల్లో మర్మమేంటో తెలియాల్సి ఉంది. మొదట్నుంచి కూడా ‘ఖైదీ నెంబర్ 150’ టీం గ్రాస్ వసూళ్ల వివరాలు మాత్రమే ప్రకటిస్తూ షేర్ మాట ఎత్తకపోవడం కూడా సందేహాలకు తావిచ్చేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు