ఒక్క రోజులో తొమ్మిది సినిమాలా?

ఒక్క రోజులో తొమ్మిది సినిమాలా?

మార్చి నెలలో చివరి వారం మినహాయిస్తే పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం తక్కువ. అందులోనూ 2, 3 వారాల్లో ఓ మోస్తరు సినిమాల్ని కూడా రిలీజ్ చేయరు. పరీక్షల హడావుడి బాగా ఎక్కువుండటంతో స్టూడెంట్స్, ఫ్యామిలీస్ థియేటర్లకు రారన్న భయమే అందుక్కారణం. ఐతే మీడియం, పెద్ద రేంజి సినిమాలేవీ రాకపోవడంతో ఈ సమయంలో చిన్న స్థాయి, విడుదలకు నోచుకోకుండా ఉన్న సినిమాల్ని థియేటర్లలోకి వదిలేస్తుంటారు. రాబోయే వీకెండ్లో ఆ తరహాలోనే థియేటర్లలోకి సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు కలిపి ఈ వారాంతంలో ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజవుతుండటం విశేషం.

ముందుగా సీనియర్ నటుడు రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ డబ్బింగ్ మూవీ ‘16’ ఈ గురువారం విడుదలవుతోంది. ఆ మరుసటి రోజు ఎనిమిది చిత్రాలు రిలీజవుతాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ‘వెళ్లిపోమాకే’. యూకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు.. అందరూ కొత్తవాళ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దిల్ రాజుకు ఈ సినిమా తెగ నచ్చేసి తన బేనర్లో రిలీజ్ చేస్తున్నాడు.

ఇక చాన్నాళ్లుగా రిలీజ్ కోసం చూస్తున్న మంచు లక్ష్మి సినిమా ‘లక్ష్మీబాంబు’, అంజలి మూవీ ‘చిత్రాంగద’ శుక్రవారమే వచ్చేస్తున్నాయి. సందీప్ కిషన్-రెజీనా జంటగా నటించిన ద్విభాషా చిత్రం ‘నగరం’ కూడా ఆ రోజే విడుదలవుతుంది. ఇవి కాక అందరూ కొత్తవాళ్లు చేసిన ‘ఆకతాయి’, ‘పిచ్చిగా నచ్చావ్’ అనే సినిమాలు కూడా ఆ రోజే వస్తాయి. ఇవి కాక ‘మెట్రో’, ‘నోటుకు పోటు’ అనే డబ్బింగ్ సినిమాలు కూడా ఈ నెల 9కే షెడ్యూల్ అయ్యాయి. మరి వీటిలో ఏవి ప్రేక్షకుల్ని మెప్పిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు