ధనుష్ అసలు ఆయన కొడుకేనా?

ధనుష్ అసలు ఆయన కొడుకేనా?

ఒక స్టార్ హీరోను పట్టుకుని ఎవరూ ఊరూ పేరు లేని వాళ్లు వచ్చి తమ కొడుకు అనడం ఆశ్చర్యం కలిగించే విషయం. సాధారణంగా ఇలాంటి వివాదాలు ఆరంభ దశలోనే ముగిసిపోతుంటాయి. మీడియా దృష్టికి కూడా రావు. కానీ తమిళ నటుడు ధనుష్ తమ కొడుకంటూ మధురైకి చెందిన ఇద్దరు దంపతులు చేస్తున్న పోరాటం హైకోర్టు వరకు వెళ్లింది. అక్కడ ఈ కేసు విచారణ ఉత్కంఠభరితంగా సాగుతోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతుండటంతో అసలు నిజమేంటన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. నిప్పు లేనిదే పొగ రాదంటారు. ఈ కేసు ఇంత వరకు వచ్చిందంటే ధనుష్ పుట్టుక విషయంలో ఏదో మతలబు ఉన్నట్లుగా అర్థమవుతోంది.

ధనుష్ నిజంగా కస్తూరి రాజా కొడుకైతే ఈ పాటికి ఎప్పుడో కేసు తెగిపోయేదనేది చాలామంది వాదన. ఎందుకంటే కస్తూరి రాజా మరీ అంత తక్కువ వాడేమీ కాదు. అతను ఎప్పట్నుంచో సినీ రంగంలో ఉన్నాడు. ధనుష్ తాలూకు బర్త్ సర్టిఫికెట్.. టెన్త్ సర్టిఫికెట్ పక్కాగా ఉన్నా ఈ కేసు తేలిపోయేది. కానీ ధనుష్ లాయర్ సమర్పించిన ఈ రెండు ధ్రువ పత్రాలూ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అతడి బర్త్ సర్టిఫికెట్లో పేరే లేదు. పుట్టిన పదేళ్ల తర్వాత తీసుకున్న బర్త్ సర్టిఫికెట్లో పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

మరోవైపు ధనుష్ సమర్పించిన టెన్త్ సర్టిఫికెట్లో అసలు పుట్టుమచ్చలే లేవు. మరోవైపు ధనుష్ తన కొడుకు అంటున్న కదిరేశన్ సమర్పించిన సర్టిఫికెట్లో పుట్టుమచ్చలున్నాయి. వాటిని ధనుష్ ఒంటిమీద పుట్టుమచ్చల్ని పోల్చి నిగ్గు తేల్చే ప్రయత్నం జరుగుతోంది. ధనుష్ కస్తూరి రాజా కొడుకైతే.. వాళ్ల చుట్టు పక్కల వాళ్లకు.. బంధువులకు.. తనతో పాటు స్కూల్లో చదివిన విద్యార్థులకు.. ఉపాధ్యాయులకు అందరికీ అతను తెలిసే ఉంటాడు. ఐతే ఈ కేసు విషయమై ఎవ్వరూ కూడా ఏ ప్రకటన చేయట్లేదు.

సరైన సాక్ష్యాధారాలు సమర్పించి ఉంటే కేసు ప్రాథమిక దశలోనే తెగిపోయేది. ఇంత రచ్చ అయ్యేది కాదు. మరోవైపు ధనుష్ తమ కొడుకే అని.. అది నిరూపించడానికి డీఎన్ఏ టెస్టులకు కూడా తాము సిద్ధమని కూడా ప్రకటిస్తున్నారు కదిరేశన్ దంపతులు. వాళ్లు అంత ధీమాగా ప్రకటన చేస్తుండటమూ ధనుష్ విషయంలో అనుమానాల్ని మరింత పెంచుతోంది. ధనుష్ కదిరేశన్ కొడుకా కాదా అన్నది తర్వాత సంగతి కానీ.. అసలు కస్తూరి రాజా కొడుకా కాదా అనే విషయంలో ముందు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ కేసు రోజు రోజుకూ ఉత్కంఠ రేపుతో ముందుకెళ్తోంది. చివరికి దీని క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English