చిరంజీవి వంద కోట్లపై అతని కన్ను!

చిరంజీవి వంద కోట్లపై అతని కన్ను!

స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుని చాలా కాలమవుతోన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఇప్పుడు ఖచ్చితంగా రెండు వందల కోట్లకి పైగా గ్రాస్‌ వసూలు చేసే సినిమా కోసం చూస్తున్నాడు. మొహంజుదారో, కాబిల్‌ చిత్రాలతో అంచనాలని అందుకోలేకపోవడంతో పాటు బాగా వెనకబడిపోయిన హృతిక్‌ అర్జంటుగా ఒక కమర్షియల్‌ చిత్రం చేస్తే తప్ప మళ్లీ మునుపటి వైభం రాదని గ్రహించాడు.

అందుకే అతను అలాంటి కథల కోసం అన్వేషిస్తోన్న దశలో అతనికి తమిళ 'కత్తి' కనిపించిందట. ఈ చిత్రాన్ని రీమేక్‌ చేద్దామంటూ గతంలోనే హృతిక్‌ని కొందరు సంప్రదించినా కానీ అతను ఆసక్తి చూపించలేదట. అయితే ఈ కథ తెలుగులో కూడా బ్రహ్మాండంగా క్లిక్‌ అయిందని, చిరంజీవి రీఎంట్రీలో ఈ చిత్రంపై వంద కోట్లకి పైగా షేర్‌ సాధించాడనే అంశం హృతిక్‌కి స్ట్రయిక్‌ అయిందట. కథలో దమ్ముంటే తప్ప రెండు భాషల్లో ఇంత పెద్ద హిట్‌ అవదని అర్థం చేసుకున్న హృతిక్‌ కత్తి, ఖైదీ నంబర్‌ 150 షో వేయించుకుని చూసాడట.

ఈ చిత్రం చేయడానికి సిద్ధమే కానీ మురుగదాస్‌ డైరెక్షన్‌ చేస్తాడేమో అడగమన్నాడట. హిందీలో పని చేయడం మురుగదాస్‌కి ఇష్టమే కనుక హృతిక్‌తో సినిమాని వదులుకోకపోవచ్చు. మహేష్‌తో చేస్తోన్న సినిమాపై దృష్టి పెట్టిన మురుగదాస్‌ అది పూర్తి చేసేలోగా దీనిపై ఒక నిర్ణయానికి రావచ్చు.