ఏపీ సర్కారు ఎంత అప్పు చేయాలో డిసైడ్ చేసిన కేంద్రం

జింక వేగంతో పరుగు పెడుతున్న ఏపీ అప్పులపై కేంద్రం ఒక కన్నేసి ఉంచింది. కొత్త నియంత్రణ పెట్టేసింది. ఏపీ రాష్ట్రం ఇప్పటి నుంచి తనకు అవసరమైనంత అప్పు చేయలేని పరిస్థితి. తాజాగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రుణాలు తీసుకొని ఖర్చులు చేసే వీలు లేని పరిస్థితి. పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నెట్ బారోయింగ్ సీలింగ్ ఎంతన్నది కేంద్రం డిసైడ్ చేస్తుంది. ఇందులోనే అన్ని రకాల అప్పులు ఉండనున్నాయి.

ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి స్థూల జాతీయోత్పత్తి ఎంత ఉండొచ్చని అంచనా వేశారో.. అందులో కేవలం నాలుగు శాతం మాత్రమే నికర రుణంగా ఉండాలి. మరింత వివరంగా చెప్పాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ – మార్చి మధ్యన) తీసుకున్న మొత్తం అప్పులో.. తిరిగి చెల్లించిన దాన్ని మినహాయిస్తే నికర రుణ పరిమితి ఎంతో అర్థమవుతుంది. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ నెట్ బారోయింగ్ సీలింగ్ రూ.42,472 కోట్లుగా తేల్చింది. ఏ రకాలైన అప్పులైనా సరే.. ఈ మొత్తానికి మించి చేయటం సాధ్యం కాదు.

బహిరంగ మార్కెట్.. ఆర్థిక సంస్థల నుంచి తీసుకునేవి.. చిన్న తరహా పొదుపు మొత్తాలు.. విదేశీ ఆర్థిక సాయం కింద కేంద్రం ఇచ్చే రుణం.. ప్రావిడెంట్ ఫండ్.. చిన్న మొత్తాల పొదుపు.. రిజర్వు నిధులు.. డిపాజిట్ల రూపంలో వినియోగించుకునే రుణం.. ఇవన్నీ కేంద్రం పేర్కొన్న అప్పుల్లోనే ఉంటాయి. స్థూల జాతీయోత్పత్తిలో నిర్దిష్టంగా కొంత మొత్తం మూలధన వ్యయంగా ఖర్చు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేయని పక్షంలో రుణ పరిమితిలో 0.50 శాతం కోత విధిస్తామని స్పష్టం చేసింది.

తాజాగా కేంద్రం చెప్పిన దాని ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రూ.27,589 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకుంటే.. చేసే అప్పులో రూ.5వేల కోట్ల మేర కోత పెట్టేస్తుంది. తాము చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? లేదా? అన్న విషయాన్ని ఏడాదికి మూడుసార్లు సమీక్ష జరుపుతారు. తాము చెప్పినట్లు చేయకుంటే.. తదుపరి అప్పునకు అవకాశం ఉండదు.