బండ్ల-పవన్.. త్రివిక్రమ్ రాయబారం

బండ్ల-పవన్.. త్రివిక్రమ్ రాయబారం

పవన్ కళ్యాణ్ దేవుడైతే నేను ఆయనకు నంబర్ వన్ భక్తుడిని అంటాడు బండ్ల గణేష్. అలాంటి బండ్ల రెండేళ్ల పాటు తనకు తానుగా పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉన్నాడట. ఐతే ఆ తర్వాత తన తప్పేంటో తనకు తెలిసిందట. అలాంటి సమయంలో పవన్ మిత్రుడైన త్రివిక్రమ్ తనను పవన్ కళ్యాణ్ తో కలిపినట్లు చెప్పాడు బండ్ల. ఈ కథాకమామిషు ఏంటో బండ్ల మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘ఎందుకో ఏంటో పవన్ బాబుకు రెండేళ్లు దూరంగా ఉండిపోయాను. ఇగో లాంటిదేదో వచ్చి అలా చేశాను. ఆయన మీద అలిగాను. కానీ ఆయనకు దూరంగా ఉండటం మన వల్ల కాదని అర్థమైంది. ఆ టైంలో త్రివిక్రమ్ గారే నన్ను పవన్ దగ్గరికి తీసుకెళ్లాడు. నువ్వు తన దగ్గర ఉండాల్సిందే అని ఆయనతో కలిపాడు. అలాగని ఇదేమీ రాజీ కుదుర్చుకునే వ్యవహారం కాదు. పవన్ తో రాజీ కుదుర్చుకునేంత సీన్ నాకు లేదు. త్రివిక్రమ్ నాకు ఫ్రెండు. అందుకే నన్ను పవన్ తో కలిపాడు’’ అని బండ్ల చెప్పాడు.

తీన్ మార్, గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో మళ్లీ సినిమాలు తీయట్లేదేంటి అని బండ్లను అడిగితే.. ‘‘పవన్ అంటే మామూలు హీరో కాదు. అలాంటి హీరో పిలిచి నన్ను సినిమా చేసుకోమన్నాడు. ‘తీన్ మార్’ ఫ్లాప్ అయితే మళ్లీ ‘గబ్బర్ సింగ్’ ఇచ్చాడు. అంత పెద్ద హీరో నాతో వరుసగా రెండు సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. శరత్ మరార్ 20 ఏళ్లుగా పవన్ తో ఉన్నాడు. అతడికి ఇప్పుడే సినిమా చేసే అవకాశం వచ్చింది. అతడికంటే ముందు నాతో సినిమా చేశాడు. ఇంకా ఎంతోమంది పవన్ తో సినిమా తీయడానికి లైన్లో ఉన్నారు. నాకు కూడా మళ్లీ ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కుతుందని అనుకుంటున్నా’’ అని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు