మంత్రి అవుతానంటున్న బండ్ల గ‌ణేష్‌

మంత్రి అవుతానంటున్న బండ్ల గ‌ణేష్‌

న‌టుడిగా చిన్న చిన్న పాత్ర‌ల‌తో ప్ర‌స్థానం మొద‌లుపెట్టి స్టార్ హీరోల‌తో భారీ సినిమాలు తీసే రేంజికి ఎదిగాడు బండ్ల గ‌ణేష్‌. త్వ‌ర‌లోనే అత‌ను రాజ‌కీయ అరంగేట్రం కూడా చేయాల‌నుకుంటున్నాడు. అంతే కాదు.. భ‌విష్య‌త్తులో మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టాల‌నుకుంటున్నాడు. అది జ‌రిగి తీరుతుంద‌ని కూడా అంటున్నాడు.

ఈ మ‌ధ్యే ఒక సెన్సేష‌న‌ల్ ఇంట‌ర్వ్యూతో వార్త‌ల్లో నిలిచిన బండ్ల గ‌ణేష్‌.. తాజాగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ రాధాకృష్ణ నిర్వ‌హించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు. ఆ ఇంట‌ర్వ్యూలోనూ బండ్ల త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని.. తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి ప‌ద‌వి చేప‌డ‌తాన‌ని అత‌నంటున్నాడు.

2019 ఎన్నికల్లో వార్ వన్‌ సైడ్ అవుతుందనీ.. పవన్ ఆ ఎన్నిక‌ల్లో తప్పక గెలుస్తాడ‌ని బండ్ల అన్నాడు. చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ విఫ‌ల‌మైంది క‌దా అని అంటే..  ఏదో ఒక‌సారి యాక్సిడెంట్ అయింది క‌దా అని.. ప్ర‌తిసారీ అలాగే జ‌రుగుతుందా అని బండ్ల ప్ర‌శ్నించాడు. పార్లమెంట్‌లో ఒక‌సారి ‘అధ్యక్షా’ అని పిలవాలనుందనీ.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల‌ని కూడా ఉంద‌ని.. రాజ‌కీయాల్లో తనకు బంగారంలాంటి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాన‌ని బండ్ల ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రాజ‌కీయ ప్ర‌సంగాల‌న్నీ త్రివిక్ర‌మ్ శ్రీనివాసే రాసిస్తాడ‌న్న ప్ర‌చారంపై త‌న‌కేమీ తెలియ‌ద‌ని బండ్ల అన్నాడు. బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌కు తాను బినామీ అని వ‌చ్చే వార్త‌ల‌పై స్పందిస్తూ.. తాను ఆంధ్రా బ్యాంకుకు మాత్ర‌మే బినామీ అని.. ఇంకెవ‌రికీ కాద‌ని అన్నాడు. నేను మర్డర్ చేసి వచ్చినా బొత్సకు కాపాడతారు అని గ‌తంలో ఒక వేదిక మీద తాను అన‌డం కొంచెం ఎక్స్‌ట్రానే అని.. ఆ వ్యాఖ్య‌ల వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డ్డాన‌ని బండ్ల వ్యాఖ్యానించాడు. ఈ ఇంట‌ర్వ్యూ తాలూకు పూర్తి వీడియో యూట్యూబ్ లోకి రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు