అబ్బాయి వద్దన్నాడు.. బాబాయి ఎలా?

అబ్బాయి వద్దన్నాడు.. బాబాయి ఎలా?

నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ముందు ఈ కాంబినేషన్ గురించి వార్తలొచ్చినపుడు చాలామంది నమ్మలేదు. కానీ ఆ కాంబోనే నిజమైంది. ఇప్పుడు తన 101వ సినిమా విషయంలోనూ బాలయ్య ఇలాంటి షాకే ఇచ్చాడు. తన శైలికి భిన్నంగా సినిమాలు చేసే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పూరి ఇప్పుడున్న పొజిషన్లో బాలయ్య అతడితో సినిమాకు ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు తనకు 'టెంపర్' లాంటి హిట్ ఇచ్చినప్పటికీ.. ఎన్టీఆర్ ఇప్పుడు పూరి దర్శకత్వంలో పని చేయడానికి అంగీకరించలేదు. 'ఇజం' ముందు వరకు పూరితో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా రిజల్ట్ చూశాక మనసు మార్చుకున్నాడు. జ్యోతిలక్ష్మీ, లోఫర్, ఇజం.. ఇలా మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్ కావడంతో పూరితో ఇప్పుడు సినిమా చేయడం సేఫ్ కాదని ఎన్టీఆర్ వెనక్కి తగ్గాడు. అలాంటిది తన వందో సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య.. పూరితో సినిమాకు అంగీకరించడమేంటో ఎవ్వరికీ అంతు బట్టట్లేదు.

అసలు పూరికి.. బాలయ్యకు సూటవుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. పూరి హీరోలు అదో రకంగా ఉంటారు. అతడి సినిమాలూ వేరుగా ఉంటాయి. బాలయ్య స్టయిల్ మరో రకంగా ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి చేసే సినిమా ఎలా ఉంటుందో ఎవ్వరికీ అంతుబట్టట్లేదు. ఎంతో ప్రత్యేకమైన కథ తెచ్చి ఉంటే తప్ప బాలయ్య ఒప్పుకుని ఉండడు. అసలు పూరి వచ్చి బాలయ్య స్టయిల్లో సినిమా చేయబోతున్నాడా.. లేక పూరి స్టయిల్లోనే బాలయ్య కనిపించబోతున్నాడా అన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు