పవన్ ఫ్యాన్స్.. అతడిని మరిచిపోయారా?

పవన్ ఫ్యాన్స్.. అతడిని మరిచిపోయారా?

ఏ ముహూర్తాన అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అన్నాడో కానీ.. అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అతను బద్ద శత్రువు అయిపోయాడు. ఆ తర్వాత ఒక వేడుకలో ఈ ‘చెప్పను బ్రదర్’ కామెంట్ల మీద వివరణ ఇచ్చుకున్నా.. పవన్ అభిమానులకు మంచి మాటలు చెప్పినా వాళ్లకు అవి పట్టలేదు.

బన్నీ మీద వాళ్లకు వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది తప్ప.. తగ్గట్లేదు. అల్లు బాబు మీద వాళ్లు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో.. ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్‌కు పోటెత్తుతున్న డిజ్ లైక్సే నిదర్శనం. మొన్న టాలీవుడ్ డిజ్ లైక్స్ రికార్డును బద్దలు కొట్టిన ‘డీజే’ టీజర్ ఇప్పుడు సౌత్ ఇండియన్ రికార్డుల్ని చెరిపేసింది.

ఇప్పటిదాకా అజిత్ ‘వేదాలం’ టీజర్ అత్యధికంగా 75 వేల డిజ్ లైక్స్ తెచ్చుకుంది. తమిళనాట అజిత్-విజయ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ మామూలే. వాళ్లు ఎప్పుడూ ఇలా నెగెటివ్ ప్రచారం చేసే పనిలోనే ఉంటారు. అందుకే ‘వేదాలం’కు అన్ని డిజ్ లైక్స్ వచ్చాయి. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ బన్నీకి వ్యతిరేకంగా అలాగే పని చేశారు. ఐతే ఇక్కడ బన్నీ మీద వ్యతిరేకత ఓకే కానీ.. ఆ చిత్ర దర్శకుడు ఎవరన్నది పవన్ ఫ్యాన్స్ కొంచెం గుర్తుంచుకోవాలి.

దాదాపు దశాబ్దం పాటు సరైన హిట్టు లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్‌కు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి.. పవన్‌ను మళ్లీ బాక్సాఫీస్ కింగ్‌ను చేశాడు హరీష్. పవన్.. పవన్ ఫ్యాన్స్ కచ్చితంగా అతడి విషయంలో కృతజ్నులుగా ఉండాలి. అతడిని చూసి అయినా.. ‘దువ్వాడ జగన్నాథం’ మీద వ్యతిరేకత తగ్గంచుకోవాలి. టీజర్ వరకు ఏం చేసినా ఓకే కానీ.. సినిమా రిలీజైనపుడు కూడా ఇలాగే వ్యతిరేక ప్రచారం చేయడం మాత్రం సమంజసం అనిపించుకోదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు