తిరుప‌తి బ‌రిలో.. పార్టీల‌ను భ‌య‌పెడుతున్న ఓట్ల చీలిక..‌!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఓట్ల చీలిక ఇప్పుడు అన్ని పార్టీల‌నూ భ‌య‌పెడుతోంది. గెలుపు త‌మ‌దేన‌ని.. మెజారిటీనే ముఖ్య‌మని భావించిన వైసీపీ నుంచి ఇక్క‌డైనా గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ‌ర‌కు అన్ని పార్టీల్లోనూ ఓట్ల చీలిక‌పై పెద్ద ఎత్తున ర‌భ‌సే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా ఎందుకు జ‌రుగుతోంది? గతంలో క‌న్నా ఇప్పుడు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఆస‌క్తిగా మారాయి. వీటికి స‌మాధానం.. గ‌తంలో కంటే.. ఇప్పుడు ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు పెరిగిపోయారు.

2019 ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. తిరుప‌తి నుంచి 8 మంది అభ్య‌ర్థులు మాత్ర‌మే పోటీ చేశారు. పైగా అవి సాధార‌ణ ఎన్నిక‌లు. ఈ ఎనిమిది మందిలోనూ ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు ఐదుగురు ఉన్నారు. మిగిలిన వారిలో ఇండిపెండెంట్లు ఉన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం.. ఏకంగా 28 మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ స‌హా బీఎస్పీ, జ‌న‌తాద‌ళ్‌(యు), యునైటెడ్ కాంగ్రెస్, ఇలా అనేక చిన్నా చిత‌కా పార్టీలు, ఇండిపెండెంట్లు, క‌మ్యూనిస్టులు.. మొత్తంగా 28మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కొంద‌రు ఇండిపెండెంట్ల‌కు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో 10 వేల ఓట్ల వ‌ర‌కు చీల్చే స‌త్తా ఉంది. దీంతో ఇప్పుడు అభ్య‌ర్థుల మ‌ధ్య ఓట్ల చీలిక అంశం ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ముఖ్యంగా కొన్ని ప్ర‌ధాన పార్టీలు.. అధికార పార్టీ త‌ప్ప‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే ఇండిపెండెంట్ల‌ను ప్రోత్స‌హించిన‌ట్టు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికితోడు కులాల వారీగా కూడా ఎస్సీ వ‌ర్గానికి చెందిన వారు విడిపోయార‌నే వాద‌న తెర‌మీదికి తెస్తున్నారు. దీంతో ఎస్సీ వ‌ర్గంలో చీలిక ఏర్ప‌డి.. ఓట్లు చీలిపోవ‌డం ఖాయ‌మనే వాద‌న వినిపిస్తోంది. మ‌రో వైపు పార్టీల ప‌రంగా.. వ్య‌క్తుల ప‌రంగా కూడా ఓట్లు చీలిపోవ‌డం క‌నిపిస్తోంది. అంటే.. ఇక్క‌డ వైసీపీ భావించిన‌ట్టు.. అత్య‌ధిక మెజారిటీ ల‌భించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. గెలిచినా అంచనాల‌కు త‌గ్గే మెజారిటీతోనే గెలిచేలా ఇత‌ర ప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని.. అందుకే ఇంత మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచార‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.