బాలయ్యా.. అవతారం మార్చవయ్యా..

బాలయ్యా.. అవతారం మార్చవయ్యా..

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం సరికొత్త అవతారంలోకి మారాడు నందమూరి బాలకృష్ణ. శాతకర్ణి లుక్ ఎలా ఉండేదని ఎవరికీ అవగాహన లేదు కానీ.. ఈ పాత్ర కోసం బాలయ్య మాత్రం మీసాన్ని నెత్తి మీద చెవుల పక్కగా వచ్చే జుట్టుతో కలిపి భిన్నమైన అవతారంలోకి మారిపోయాడు. ఆ లుక్‌కు జనాల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. సినిమాకు అది ప్లస్సే అయింది.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ అయ్యాక కూడా బాలయ్య అవతారం మార్చలేదు. అదే రూపంలో ప్రమోషన్లకు వచ్చాడు. అదేమీ జనాలకు ఆశ్చర్యం కలగలేదు. ఐతే ‘శాతకర్ణి’ విడుదల తర్వాత కూడా బాలయ్య అలాగే కనిపించడంతో థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు ప్రమోషన్ల కోసం అలాగే కనిపిస్తున్నాడేమో అనుకున్నారంతా.

కానీ ఇప్పుడు ‘శాతకర్ణి’ కథ ముగిసింది. ఆ సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయి కూడా రెండు వారాలవుతోంది. ఇప్పటికీ బాలయ్య మాత్రం అవతారం మార్చట్లేదు. బుధవారం సీనియర్ సంగీత దర్శకుడు కోటి కొడుకు రాజీవ్ పెళ్లిలో కూడా బాలయ్య ‘శాతకర్ణి’గానే కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

తాను ఏదైనా సినిమా చేస్తుంటే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తానని.. ఎప్పుడూ అదే ట్రాన్స్‌లో ఉంటానని అంటుంటాడు బాలయ్య. ఐతే సినిమా షూటింగ్ అయ్యింది.. విడుదలై వెళ్లిపోయింది కూడా. అయినా ‘శాతకర్ణి’ పాత్ర నుంచి బాలయ్య బయటికి రాలేదింకా. తన కొత్త సినిమా సెట్స్ మీదికి వెళ్లేవరకు బాలయ్య ఇలాగే ఉండాలని ఫిక్సయ్యాడో ఏంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English