‘బేతాలుడు’ దెబ్బేసినా మళ్లీ రిస్క్ చేశారే..

‘బేతాలుడు’ దెబ్బేసినా మళ్లీ రిస్క్ చేశారే..

‘బిచ్చగాడు’ తర్వాత తెలుగులో విజయ్ ఆంటోనీ ఫేట్ మారిపోయింది. అతడి తర్వాతి సినిమా ‘బేతాళుడు’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందు సినిమాలో తొలి నిమిషాల కంటెంట్ మీడియాకు రిలీజ్ చేసేశాడు విజయ్ ఆంటోనీ.

అది చూసి జనాలు సినిమా మీద అంచనాలు మరింత పెంచుకున్నారు. ఐతే ప్రేక్షకులు ఏదో ఊహించుకుని సినిమాకు వెళ్తే.. అక్కడ ఇంకేదో కనిపించింది. ఐతే ‘బేతాళుడు’ విషయంలో తేడా వచ్చినా సరే.. తన కొత్త సినిమా ‘యమన్’కు సంబంధించి కూడా కొంత కంటెంట్ బయటపెట్టాడు విజయ్ ఆంటోనీ.

‘యమన్’ సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాన్ని విడుదలకు మూడు రోజుల ముందే యూట్యూబ్ లో పెట్టేశారు. ఈ సినిమాలో హీరో తన ప్రమేయం లేని ఒక నేరానికి సంబంధించి జైలుకు వెళ్తాడు. డబ్బు కోసం ఒక యాక్సిడెంట్ తనే చేసినట్లు ఒప్పుకుని జైలుకెళ్తాడు. అక్కడ జైల్లో అతడిని ఒక వ్యక్తి వచ్చి బెదిరిస్తాడు. ఆ యాక్సిడెంట్ ఎవరు చేయించారు.. దానికి సంబంధించిన డీటైల్స్ అడుగుతాడు. అప్పుడు హీరో తనదైన శైలిలో అతడికి జవాబిస్తాడు.

సినిమాలోని ఇంటెన్సిటీ అంతా ఈ సన్నివేశంలో కనిపిస్తోంది. సినిమా మీద అంచనాల్ని పెంచేలా ఉంది ఈ సీన్. ఇలా ముందే కంటెంట్ రిలీజ్ చేసినపుడు ఒకసారి ఎదురు దెబ్బ తగిలినా.. దాన్ని సెంటిమెంటుగా భావించకుండా మళ్లీ అదే బాటలో నడవడం విశేషమే. జీవా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమన్’ ఈ శుక్రవారమే తమిళ.. తెలుగుభాషల్లో ఒకేసారి రిలీజవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు