నమో వేంకటేశాయ.. అక్కడ హిట్టవుతుందిలే

నమో వేంకటేశాయ.. అక్కడ హిట్టవుతుందిలే

తొలి రోజు వసూళ్లు చూసి ఎలా అయితే భయపడ్డారో అలాగే జరిగింది. ‘ఓం నమో వేంకటేశాయ’ తర్వాత కూడా పుంజుకోలేదు. దారుణమైన వసూళ్లతో రెండో వారానికే థియేట్రికల్ రన్ ముగిసిపోయే స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఆ సినిమాను నామమాత్రంగా మాత్రమే థియేటర్లలో నడిపిస్తున్నారు. చాలా థియేటర్లలో దాన్ని తీసేసి ‘నేను లోకల్’ వేసుకున్నారు. కొత్త సినిమా ‘ఘాజీ’ కూడా చాలా థియేటర్లను తీసుకుంది. ఇంకా ఆశ చంపుకోకుండా వెంకయ్య నాయుడితో మాట్లాడించడం.. ఇంటర్వ్యూలవీ చేయడం చేస్తున్నారు కానీ.. ఈ ప్రమోషన్ వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని తేలిపోయింది. ఈ శుక్రవారం విన్నర్.. యమన్ సినిమాలు వచ్చేసరికి ‘ఓం నమో వేంకటేశాయ’ అడ్రస్ గల్లంతయిపోవడం ఖాయం.

రూ.40 కోట్ల బిజినెస్ చేసిన ‘ఓం నమో వేంకటేశాయ’ రూ.15 కోట్ల షేర్ మార్కును అందుకోవడం కూడా కష్టంగానే ఉంది. దీంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవు. మరి రూ.11.5 కోట్ల భారీ రేటు పెట్టి ఈ చిత్ర శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసిన ఈటీవీ పరిస్థితి ఏంటి అని సందేహం రావచ్చు. కానీ ‘ఓం నమో..’ బాక్సాఫీస్ రిజల్ట్ చూసి ఆ ఛానెల్ మరీ కంగారు పడాల్సిన పనేమీ లేకపోవచ్చు. ఈ మధ్య కొన్ని మంచి సినిమాలు థియేటర్లలో ఆడకున్నా బుల్లితెరపై.. యూట్యూబ్‌లో మాత్రం సూపర్ హిట్టవుతున్నాయి. అందుకు ‘మనమంతా’ ఒక ఉదాహరణ. గత ఏడాది ఈ సినిమా థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ.. టీవీల్లో మాత్రం మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధించింది. అలాగే యూట్యూబ్‌లో కూడా భారీగా హిట్స్ వచ్చాయి.

‘ఓం నమో..’కు మంచి టైమింగ్‌లో రిలీజ్ కాకపోవడం ప్రతికూలమైంది. పిల్లలందరూ పరీక్షల హడావుడిలో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాలేదు. ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్సే కీలకం. వాళ్లు మిస్సవడంతో సినిమాకు అలాంటి ఫలితం వచ్చింది. ఐతే ‘ఓం నమో..’ లాంటి మంచి ఆధ్యాత్మిక చిత్రం టీవీల్లో వస్తే జనాలు బాగానే చూసే అవకాశముంది. మంచి టైమింగ్ చూసుకుని సమ్మర్లో ఒక వీకెండ్ రిలీజ్ చేశారంటే మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశముంది. తెలుగు టీవీ చరిత్రలో అత్యధిక రేటింగ్ తెచ్చుకున్న సినిమా ‘శ్రీరామదాసు’ అన్న విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ‘ఓం నమో..’ టీవీలో హిట్టయ్యేందుకు మంచి అవకాశాలు ఉన్నట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు