వెంకటేష్‌కి జగన్‌ కొత్త ఆఫర్‌

వెంకటేష్‌కి జగన్‌ కొత్త ఆఫర్‌

వెంకటేష్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భారీ చిత్రమొకటి రూపొందనుందని కొంతకాలంగా వస్తున్న వార్తలను వినే వుంటారు. అయితే వెంకటేష్‌ మార్కెట్‌కి మించి జగన్‌ భారీ బడ్జెట్‌ అడుగుతుండడం వల్ల ఆ ప్రాజెక్ట్‌ ముందుకి కదల్లేదు. ఏదైనా కార్పొరేట్‌ సంస్థ భాగస్వామ్యం తీసుకుంటుందేమోనని సురేష్‌ బాబు పలు సంస్థలని కాంటాక్ట్‌ చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది.

కనీసం ఇరవై కోట్ల వరకు రిస్క్‌ అనిపించిన ఆ ప్రాజెక్ట్‌ ముందుకెళ్లకపోవడంతో జగన్‌ ఈలోగా వెంకటేష్‌కి మరో కథ చెప్పాడట. వెంకీతో ఈ కొద్ది రోజుల్లో ఏర్పడిన ర్యాపోతో ఎలాగైనా ఈ సినిమా ట్రాక్‌ ఎక్కించాలని జగన్‌ చూస్తున్నాడు. ఇటీవలి కాలంలో తను తీసిన ఫ్లాపుల వల్ల ఇతర హీరోలెవరూ పూరి జగన్నాథ్‌తో సినిమా అంటే ఉత్సాహం చూపించడం లేదు. అగ్ర హీరోలని వదిలిపెట్టి యువ హీరోలు కూడా పూరి అంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది.

దీంతో రోగ్‌ తర్వాత వెంకీ చిత్రం చేసి తీరాలని పూరి జగన్నాథ్‌ బలంగా ప్రయత్నిస్తున్నాడు. పాతిక కోట్ల బడ్జెట్‌లో అయిపోయే కథ ఒకటి వెంకీకి చెప్పాడని, ఆయన ఓకే చెప్పినప్పటికీ ఇంకా సురేష్‌ బాబు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని సమాచారం. గురు రిలీజ్‌ తర్వాత వెంకీ కొత్త సినిమా గురించి నిర్ణయించుకుంటే మంచిదనేది సురేష్‌బాబు అభిమతం. కానీ త్వరగా వెంకీతో కమిట్‌ చేయించకపోతే వేరే సినిమాకి ఓకే చెప్పేస్తాడేమోనని పూరీ భయం.