ఇంటర్వ్యూల పేరుతో రోడ్డెక్కేస్తున్నారు

ఇంటర్వ్యూల పేరుతో రోడ్డెక్కేస్తున్నారు

ఇంతవరకు ఇండస్ట్రీలో జరిగే ఆంతరంగిక విషయాలన్నీ ఇండస్ట్రీకే పరిమితం అయ్యేవి. ఒకరిపై ఒకరికి కోపాలున్నా కానీ అవి బయటకి పొక్కేవి కావు. టీవీ మీడియా విప్లవంలోను తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్లు సంయమనం పాటించారు. కానీ అదేంటో యూట్యూబ్‌ విప్లవంలో మాత్రం ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ రోడ్డున పడిపోతున్నారు.

ఫలానా వాడు ఇచ్చిన ఇంటర్వ్యూ కంటే తనది పాపులర్‌ అవ్వాలంటూ సంచలన విషయాలని, తెర చాటు సంగతులని పబ్లిక్‌గా మాట్లాడుతున్నారు. దీని వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావడంతో పాటు శత్రుత్వాలు పెరుగుతున్నాయి. అంతే కాకుండా తమకి సంబంధించిన చీకటి విషయాలు బయటకి వచ్చి గౌరవం కోల్పోతున్నారు. ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల నటులకి, నిర్మాతలకి ఏమీ ఒరగదు కానీ వీళ్ల పేరు చెప్పుకుని యూట్యూబ్‌ వ్యూస్‌ మీద కొన్ని కంపెనీలు బతికేస్తున్నాయి.

రాను రాను పరిస్థితి ఏమైపోయిందంటే ఏ గ్రేడ్‌ వాళ్ల దగ్గర ఏమీ మేటర్‌ వుండదని బి గ్రేడ్‌ వాళ్లతోనే ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాళ్లయితే తమ సెలబ్రిటీ స్టేటస్‌ గురించి వర్రీ అవ్వక్కర్లేకుండా నోటికొచ్చింది మాట్లాడేస్తారు కాబట్టి ఏవైనా రెండు సంచలన విషయాలు చెబితే ఇక జనాన్ని ఆకట్టుకుని వ్యూస్‌ తెచ్చుకోవచ్చు.

ఈ ట్రెండ్‌ ఎన్నాళ్లు సాగుతుందనేది తెలియదు కానీ ఇది మంచి వ్యాపారంగా కనిపించి రోజుకో కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ చేసి తెలుగు ఇండస్ట్రీ వాళ్లతో బతుకు జట్కా బండి షో నడిపించేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు