చంద్రబాబే అడిగారు- ఏసీబీ ప్రత్యేక కోర్టులో స్టీఫెన్ సన్ ?

రాజకీయ సంచలనంతో పాటు.. పెను పరిణామాలకు మూలమైన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాము చెప్పిన వారికి ఓటు వేయాలంటూ రూ.50లక్షల డీల్ మాట్లాడిన స్టీఫెన్ సన్.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వటం.. అప్పట్లో రేవంత్ ను రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తాజా విచారణకు హాజరైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్.. కోర్టుకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనేం చెప్పారన్నది చూస్తే..

  • టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను ప్రలోభ పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలన్నారు. ఫోన్లో నేరుగా మాట్లాడారు.
  • మనవాళ్లంతా బ్రీఫ్ చేశారు. వాళ్లు చెప్పినట్లు చేయాలని కోరారు. తానున్నానని వాళ్లు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
  • టీడీపీ క్రిస్టియన్ సెల్ కన్వీనర్ గా పరిచయం చేసుకున్న సెబాస్టియన్.. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎంత డబ్బు కావాలో చెబితే అంత ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని సెబాస్టియన్ వివరించారు.
  • బాబు నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా ఆంథోనీ అనే వ్యక్తి ద్వారా సెబాస్టియన్ నన్ను సంప్రదించారు. బాబు ప్రతినిధిగా పార్టీలో కీలకమైన వ్యక్తి వస్తేనే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పా. దీంతో చంద్రబాబు ప్రతినిధిగా రేవంత్ మాట్లాడటానికి వస్తారని చెప్పారు.
  • లంచం తీసుకోవటం ఇష్టం లేకనే ఏసీబీ అధికారుల్ని సంప్రదించా.
  • ఏసీబీ అధికారులు మేం ఉన్న ప్లాట్ లో ఐఫోన్ ను.. ఇతర ఆడియో.. వీడియో పరికరాల్ని ఏర్పాటు చేశారు. 2015 మే 30న రేవంత్.. సెబాస్టియన్.. ఉదయసింహలు ప్లాట్ కు వచ్చారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5కోట్లు ఇస్తామని.. రూ.50 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తున్నట్లు చెప్పి ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఓటింగ్ తర్వాత ఇస్తామన్నారు.
  • బ్యాగును టీపాయి మీద పెట్టిన వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి రేవంత్ తదితరుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని పాక్షికంగా నమోదుచేసిన జడ్జి.. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల ఏడుకు వాయిదా వేశారు.